సొంత వాహనానికి అద్దె.. తొర్రూరు కమిషనర్‌పై ఆరోపణలు

సొంత వాహనానికి అద్దె.. తొర్రూరు కమిషనర్‌పై ఆరోపణలు

తొర్రూరు, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత వాహనాన్ని వినియోగిస్తూ మున్సిపాలిటీ నుంచి అద్దె తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాను అవినీతికి వ్యతిరేకమని, సిబ్బంది ఎవరైనా డబ్బులు తీసుకుంటే ఉపేక్షించబోనని చెప్పే కమిషనర్ వ్యవహార శైలి అందుకు విరుద్ధంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంటి అనుమతులు, ఇంటి నంబర్లు, ఇంటి పన్నుల విషయంలో కొందరు మధ్యవర్తుల ద్వారా వసూళ్లు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి 10 నెలలు అవుతున్నా, సొంత కారును వినియోగిస్తూ నెలకు రూ.33 వేల అద్దె తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో శానిటేషన్ వాహనం పేరిట డీజిల్ ఖర్చులు చూపిస్తున్నారని, మున్సిపాలిటీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

శానిటరీ సిబ్బందిని డ్రైవర్‌గా వినియోగిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కమిషనర్ వినియోగిస్తున్న వాహనం రచన మద్ది పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని, మున్సిపాలిటీ నుంచి అద్దె రూపంలో రూ.33 వేలు పొందుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కమిషనర్‌కు సన్నిహితులుగా ఉన్న ఇద్దరి ద్వారా వివిధ పనుల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నిజానిజాలు వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.