Palamuru Projects | పనుల వేగం పెంచాలి…
Palamuru Projects | పనుల వేగం పెంచాలి…
పాలమూరు ప్రాజెక్టులపై సీఎం ప్రత్యేక దృష్టి
Palamuru Projects | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండో రోజు నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కీలక పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెరలోని పీఆర్‌ఎల్‌ఎస్ పంప్‌హౌస్‌ను సీఎం పరిశీలించారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ ప్యాకేజీ-2, ప్యాకేజీ-3 కాలువల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరితో కలిసి పనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పూర్తి ద్వారా జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
