Social Media |ఎంపీ కేశినేని చిన్ని ప్రతిష్ఠ దెబ్బతీయడమే లక్ష్యమా..?
Social Media | ఎంపీ కేశినేని చిన్ని ప్రతిష్ఠ దెబ్బతీయడమే లక్ష్యమా..?
ఎంపీ చిన్ని లక్ష్యంగా దుష్ప్రచారాలు..
వాట్సాప్ ప్రచారంపై పోలీసుల కేసు నమోదు..
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..
తాతినేని రాంబాబుకు నోటీసులు.. రంగంలోకి దిగిన మాజీ ఎంపీ నాని
ప్రేరేపిత కేసులంటూ ట్వీట్…
అభివృద్ధిపైనే మా దృష్టి అంటూ ఎంపీ చిన్ని ప్రతిస్పందన
రాజకీయ ప్రాధాన్యతగా మారిన ట్విట్లు.
Social Media | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : వరుసకు ఇద్దరు అన్నదమ్ములే, కానీ రాజకీయంగా ఇద్దరూ బద్ధ శత్రువులు. విజయవాడ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న కేసుని బ్రదర్స్ మధ్య మళ్ళీ ట్విట్టర్ వార్ మొదలైంది. రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారం కొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసుల జోక్యం, మాజీ ఎంపీ కేశినేని నాని స్పందన, ఎంపీ చిన్ని చేసిన పరోక్ష వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య మాటల యుద్ధంగా మారిన ఈ వ్యవహారం ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.
ఎంపీపై దుష్ప్రచారం అంటూ..
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ టార్గెట్‌గా చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని,ఎంపీ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎంపీ కేశినేని చిన్నిపై ఆర్థిక, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన ఆరోపణలు చేస్తూ పోస్టులు ప్రచారం చేసిన వ్యక్తిగా తాతినేని రాంబాబును గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రచారం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా? వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణను చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు తాతినేని రాంబాబు నివాసానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసి విచారణకు హాజరుకావాలని సూచించినట్లు తెలిసింది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా జరిగిన ప్రచారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే అంశంపై కూడా పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు.
ప్రేరేపిత కేసు అంటూ..
ఈ పరిణామాలపై మాజీ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ, రాజకీయాలతో సంబంధం లేని తన చిన్ననాటి స్నేహితుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాంబాబు ఇంటికి వెళ్లిన పోలీసుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ, ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని ఆయన ఎక్స వేదికగా అభిప్రాయపడ్డారు.
అభివృద్ధిపైనే నా దృష్టి…
మరోవైపు ఎంపీ కేశినేని చిన్ని ఈ వివాదంపై నేరుగా స్పందించకుండా సోషల్ మీడియా వేదికగా తన వైఖరిని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు పుకార్లు సృష్టించడం, అసత్యాలను పదేపదే ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం వంటి చర్యలకే పరిమితమవుతున్నారని వ్యాఖ్యానించారు. తాను మాత్రం ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలు, విజయవాడ పురోగతి లక్ష్యంగా పనిచేస్తున్నానని ఘాటుగా స్పందించారు.
అంతా సోషల్ మీడియా రాద్ధాంతమే…
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా రాజకీయ ప్రచారానికి ప్రధాన వేదికగా మారిన నేపథ్యంలో, అసత్య సమాచారం, దుష్ప్రచారం, వ్యక్తిగత దాడులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ఒకవైపు పోలీసు దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు రాజకీయ విమర్శలు, ప్రత్యారోపణలు మరింత వేడెక్కుతున్నాయి. దర్యాప్తు తుది నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ వ్యవహారంలో పూర్తి వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా పోస్టులతో మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ, చట్టపర, ప్రజా చర్చల కేంద్రబిందువుగా మారడం విశేషం.
