Kerala | హైబ్రిడ్ గంజాయ్ తో చిక్కిన సినీ ద‌ర్శ‌కులు..

తిరువ‌నంత‌పురం – కేరళ పోలీసుల నేతృత్వంలోని ఎక్సైజ్‌ అధికారుల బృందం కొచ్చిలో నిర్వహించిన దాడుల్లో సినీ ప్రముఖుల వద్ద హైబ్రిడ్‌ గంజాయి స్వాధీనమైంది. ఈ కేసులో ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు ఖలీద్‌ రెహమాన్‌, అష్రఫ్‌ హంజా అరెస్టయ్యారు. ఈ ఇద్దరితో పాటు వారి స్నేహితుడు షలీఫ్‌ మొహ్మద్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.6 గ్రాముల హైబ్రిడ్‌ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది.
సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్ అద్దెకు తీసుకున్న కొచ్చిలోని ఒక ఫ్లాట్‌లో నేటి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు జరిపారు. కొచ్చిలోని పూర్వా గ్రాండ్‌బే ఫ్లాట్ నంబర్ 506లో గంజాయిని ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందం వెంటనే రంగంలోకి దిగి దాడులు చేపట్టింది. గంజాయిని ఉపయోగించేందుకు సిద్ధమవుతున్న క్రమంలోనే స్వాధీనం చేసుకొని.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నది. ముగ్గురు చాలాకాలంగా గంజాయిని వినియోగిస్తున్నారని తేలిందని అధికారులు పేర్కొన్నారు. పోలీసులు ఈ ముగ్గురిపై 1985 నాటి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంలోని సెక్షన్ 20(B)(2)A అండ్‌ 29 కింద కేసు నమోదు చేశారు.

ఫ్లాట్ యజమాని వివరాలను కూడా సేకరిస్తున్నట్లు అధికారి తెలిపారు. ఖలీద్ రెహమాన్ మలయాళ ప్రముఖ దర్శకుడు. ఆయన ‘అనురాగ కరిక్కిన్‌వెల్లం’, ‘ఉండా’, ‘తల్లుమల’ తదితర హిట్‌ చిత్రాలను అందించారు. ఆయన ఇటీవల ‘అలప్పుళ జింఖానా’ చిత్రం తెరకెక్కించగా.. సంచలనం సృష్టిస్తోంది. అదే సమయంలో అష్రఫ్ హంజా ‘తమాషా’, ‘భీమంటే వాజీ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాలు కలకలం సృష్టిస్తున్నది. గతంలో నటుడు షైన్‌ టామ్‌ చాకో సైతం మాదకద్రవ్యాల కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో అరెస్టు కాగా.. ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

Leave a Reply