‘ఔషధి–నెక్స్ట్ జెన్’ అనుసంధానంపై ముమ్మర తనిఖీలు
‘ఔషధి–నెక్స్ట్ జెన్’ అనుసంధానంపై ముమ్మర తనిఖీలు
ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్
విజయవాడ, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఔషధి–నెక్స్ట్ జెన్’ పోర్టల్ అనుసంధాన ప్రక్రియపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి మందుల సరఫరా, ఆన్లైన్ డేటా నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముందుగా ఫార్మసీ విభాగాన్ని సందర్శించిన డీఎంఈ, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలు, వాటి వినియోగానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ‘ఔషధి’ పోర్టల్లో నమోదవుతున్న సమాచారం, కొత్తగా ప్రవేశపెట్టిన ‘నెక్స్ట్ జెన్’ వ్యవస్థతో ఎంత మేరకు అనుసంధానమవుతోందనే అంశాన్ని నిశితంగా పరిశీలించారు.
అనంతరం జనరల్ ఓపీ విభాగానికి వెళ్లిన ఆయన, వైద్యులు రోగులకు సూచిస్తున్న మందుల ప్రిస్క్రిప్షన్లు, కంప్యూటర్లో నమోదవుతున్న డేటాను సరిపోల్చి చూశారు. ఈ సందర్భంగా రోగులకు రాసిన మందుల వివరాలు ‘నెక్స్ట్ జెన్’ పోర్టల్లో పూర్తిస్థాయిలో ప్రతిబింబించకపోవడాన్ని గుర్తించారు.
డేటా నమోదు ప్రక్రియను కేవలం విధి నిర్వహణగా కాకుండా, కచ్చితత్వం, పారదర్శకతతో చేపట్టాలని సిబ్బందికి డీఎంఈ సూచించారు. వైద్య సేవల నాణ్యత పెంపు, మందుల సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో ‘ఔషధి–నెక్స్ట్ జెన్’ అనుసంధానం కీలకమని పేర్కొన్నారు.
తనిఖీల సందర్భంగా గుర్తించిన లోపాలు, సాంకేతిక సమస్యలు, అనుసంధాన ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు డాక్టర్ విష్ణువర్ధన్ వెల్లడించారు. ఆసుపత్రుల్లో డిజిటల్ సేవల అమలును మరింత పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
