ఐదేళ్ల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం
ఐదేళ్ల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం
విన్నమాల గ్రామ వృద్ధ దంపతులకు ఊరట.. ఇంటికే వెళ్లి పట్టా అందజేసిన అధికారులు
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన వృద్ధ దంపతుల భూ సమస్యకు కలెక్టర్ వెంకటేశ్వర్ జోక్యంతో శాశ్వత పరిష్కారం లభించింది. వారి భూమిని నిషేధిత జాబితా 22-ఏ నుంచి తొలగించి పట్టా జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన పల్లమాల చంద్రపాల్‌కు సంబంధించిన 85 సెంట్ల భూమికి భూ హక్కు పట్టాను నాయుడుపేట మండల తహసీల్దార్ స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. విన్నమాల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పల్లమాల చంద్రపాల్, ఆయన భార్యకు గ్రామంలోని సర్వే నంబర్ 344-4లో 85 సెంట్ల భూమి ఉందన్నారు. అయితే ఆ భూమిని పొరపాటున దేవాదాయ శాఖ భూమిగా గుర్తించి నిషేధిత జాబితా 22-ఏలో చేర్చినట్లు తెలిపారు.
తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి తిరిగి హక్కులు కల్పించాలని బాధితులు గత ఐదేళ్లుగా అధికారులకు దరఖాస్తులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో భూమికి సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పూర్తి నివేదికను ఆరు నెలల క్రితం దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపినట్లు వెల్లడించారు.
పరిశీలన అనంతరం సదరు భూమి పల్లమాల చంద్రపాల్‌కు చెందినదిగా నిర్ధారణ కావడంతో 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి వారి పేరుపై పట్టా జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు సరైన ఆధారాలతో తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు.
