బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన జశ్విత్ కు సన్మానం..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఆర్. జశ్విత్ 2025–26 విద్యా సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి గుర్తింపు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా బుధవారం దండేపల్లి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు జశ్విత్ను ఘనంగా సన్మానించారు.
గ్రామ సర్పంచ్ అజ్మీరా రాజేశ్వర్ నాయక్ జశ్విత్కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. అలాగే విద్యార్థిని తీర్చిదిద్దిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘర్ష రాజేశ్వరరావును కూడా ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాజేశ్వర్ నాయక్, మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, ఉపసర్పంచ్ నవీన్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే పునాదని పేర్కొన్నారు. జశ్విత్ సాధించిన విజయం గ్రామంలోని ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల సహకారం కూడా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు సంఘర్ష రాజేశ్వరరావు మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యా ప్రగతికి గ్రామస్తులు, తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. అందరి సహకారంతో మరింత మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కట్కూరి రాజన్న, కట్ట వెంకటేష్, గడిపెల్లి సత్యం, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని జశ్విత్ను అభినందించారు.
