ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పరిశీలన..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తహశీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటర్ల నమోదు, వివరాల సవరణ ప్రక్రియను వారు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నమోదైన ఓటర్ల వివరాల్లో ఏవైనా మార్పులు, చేర్పులు అవసరమైతే వాటిని సకాలంలో సరిచేయాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, వివరాల సేకరణను వేగవంతం చేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి స్వరూప, జీపీవో తిరుమల, ఉప సర్పంచ్ పుట్టపాక తిరుపతి, మాజీ సర్పంచ్ ఆడాయి కాంతారావు, బీఎల్ఓలు సామల పద్మ, మేక పుష్పలత, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
