3rdJuneeditorial | సరిహద్దు వివాదాలపై భారత్ విధానం
3rdJuneeditorial | సరిహద్దు వివాదాలపై భారత్ విధానం
3rdJuneeditorial | బాలేంద్ర షా వ్యాఖ్యలపై భారత స్పందన
కాలాపానీ, లిపులేఖ్ వివాదాల అసలు పరిస్థితి
కేపీ శర్మ ఓలి నుంచి బాలేంద్ర షా వరకు
భారత్-నేపాల్ చారిత్రక, సాంస్కృతిక బంధాలు
3rdJuneeditorial | సరిహద్దు వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది భారత్ విధానం. చైనా, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్‌లతో సరిహద్దు వివాదాలను ఇదే రీతిలో పరిష్కరించుకోవాలన్నది దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న విధానం.
నేపాల్ బ్రిటిష్ వారి కాలంలో భారత్‌కు అంతర్భాగం కాదు. అయితే, ఇరు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన సంబంధాలు ఉన్నాయి. నేపాల్‌లో ప్రధానంగా హిందూ మతస్థులే ఉన్నారు. అక్కడి రాచరిక వ్యవస్థ ముగిసే వరకు అది హిందూ రాజ్యంగానే పరిగణించబడింది. ఇప్పటికీ అక్కడి రాజవంశ వారసత్వానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతంలోని రాజవంశాలతో అక్కడి రాజవంశాలకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి.
అయినప్పటికీ, రాజకీయ ప్రయోజనాల కోసం భారత్‌తో తగాదాలకు సిద్ధమవుతుంటారు. తాజాగా నేపాల్ ప్రస్తుత ప్రధాని బాలేంద్ర షా ఒక ఇంటర్వ్యూలో భారత్‌తో తమకు సరిహద్దు వివాదం ఉందని, కొన్ని ప్రాంతాలను భారత్ ఆక్రమించుకుందని, మరికొన్ని ప్రాంతాలను తమ దేశం ఆక్రమించుకుందని అన్నారు.
వాస్తవానికి ఇది నిజం కాదు. నేపాల్‌తో భారత్‌కు ఉన్న సరిహద్దు సమస్యలు దాదాపు 98 శాతం విభజన కాలంలోనే పరిష్కారమయ్యాయని, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలపై మాత్రమే చిన్న వివాదం ఉందని, దానిపై చర్చలు జరుగుతున్నాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ నిజం.
నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి ఉన్నప్పుడు కూడా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. అప్పుడు కూడా మన దేశం ఇదే సమాధానం ఇచ్చింది. ఇప్పుడు బాలేంద్ర షా ఇంకో అడుగు ముందుకు వెళ్లి, గతంలో నేపాల్, భారత్ బ్రిటిష్ పాలనలో ఉన్న దృష్ట్యా ఈ వివాదం పరిష్కారానికి బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం కోరాలని సూచించారు. ఇది ఎంత అసంబద్ధమో చరిత్ర చెబుతోంది.

నేపాల్ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడిన తర్వాత అక్కడి రాజు త్రిభువన్ షా, ఆ తర్వాత రాజు బీరేంద్ర హయాంలో కూడా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండేవి. ఆ కాలంలో కూడా ఇప్పుడు బాలేంద్ర షా ప్రస్తావించిన సరిహద్దు సమస్యలు ప్రస్తావనకు వచ్చినా, రెండు దేశాలు వాటిని తీవ్రంగా తీసుకోలేదు. మరి ఇప్పుడు ఆయన ఎందుకు తీవ్రంగా పరిగణిస్తున్నారో తెలియడం లేదు.
కేపీ శర్మ ఓలి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన భారత్‌తో తగువు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. అందుకు నాందిగా అధికారం చేపట్టిన వెంటనే చైనాలో పర్యటించారు. ఓలీకి ముందు ప్రధానిగా ఉన్న పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ భారత్‌తో మైత్రిని కొనసాగించాలని భావించారు.
నేపాల్ చరిత్ర అంతా భారత్‌తోనే ముడిపడి ఉంది. ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి నేపాల్ రాజవంశానికి చెందిన వారే. నేపాల్ రాజవంశంతో భారతానికి విడదీయలేని సంబంధాలు ఉన్నాయి. అందువల్ల భారత్‌తో తగువు పెట్టుకోవాలని నేపాల్ రాజవంశీకులు ఎవరూ ప్రయత్నించలేదు.
కాలాపానీ, లిపులేఖ్ అంశాలు ఏనాటివో అవి. వాటిని నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి తవ్వి తీశారు. ఇప్పటికీ అక్కడి ప్రజలు భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు నేపాల్ నుంచి ఎంతో మంది హిందువులు వచ్చారు. అలాగే, ఉత్తర దేశ యాత్ర చేసే భారతీయులు నేపాల్‌లోని పశుపతినాథ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. దాంతో తమ యాత్ర పూర్తి అయినట్లు భావిస్తారు.
