సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్
అర్హులైన ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు చేరాలి: డిప్యూటీ చైర్మన్ డా. బండ ప్రకాష్
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి పేద కుటుంబానికి చేరాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా. బండ ప్రకాష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మార్మాట్, డేవిడ్, డీఎఫ్‌ఓ బాలమణి, అదనపు ఎస్పీ చిత్తరంజన్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. బండ ప్రకాష్ మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో నంబర్ వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. జిల్లాలో మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 2.26 కోట్ల మహిళా ప్రయాణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాకు 8,782 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. రైతు భరోసా కింద 1.32 లక్షల మంది రైతులకు రూ.131 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రైతు బీమా ద్వారా మరణించిన రైతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందిస్తున్నామని వివరించారు. విద్య, వైద్యం, ఉపాధి, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పథకం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు, ఆరోగ్య మహిళ కార్యక్రమాలు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని తెలిపారు.
జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు శాఖ, బ్యాంకర్లు, మీడియా ప్రతినిధులకు డా. బండ ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. అందరూ సమిష్టిగా కృషి చేసి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామి జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్కులో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు ఆయన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీర శ్యాం నాయక్, నాయకులు గాధవేని మల్లేష్, గంధం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
