ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న అన్నదాతలు…

ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న అన్నదాతలు…
వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా రైతులు.
పత్తివిత్తనాలుపెట్టేందుకుఆసక్తి చూపుతున్నరైతులు.
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఎండాకాలం దుక్కులు దున్ని పొలాలు చదును చేసిన అన్నదాతలు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో మంగళవారం 13 మీ మీ వర్షపాతం నమోదు కావడంతో పలువురు రైతులు పత్తి విత్తనాలు పెడుతున్నారు. ఇటీవల మండలంలో 49 మీ మీ వర్షపాతం నమోదు కావడంతో దుక్కులు దున్ని పంట సాగు కోసం సిద్ధమైన రైతులు పత్తి విత్తనాలు పెడుతున్నారు. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి పంటలు నష్టపోయిన కర్షకులు ఈ ఏడాదైనా పంటలు పండుతాయనే గంపెడాశతో ఉన్నారు. ఊట్కూర్, తిప్రాస్ పల్లి, పెద్దపొర్ల, చిన్నపొర్ల, ఎడవెల్లి, నిడుగుర్తి, సమస్త పూర్, దంతాన్ పల్లి, తదితర గ్రామాల్లోని రైతులు వర్షం కురవడంతో పత్తి విత్తనాలు పెడుతున్నారు. ఊట్కూర్ మండలంలో గత ఏడాది 40, వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురుస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని పలువు అభిప్రాయపడుతున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విత్తనాలు ఎరువులు తెచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.

డీజిల్ కొరతతో పంటసాగుకు ఇబ్బంది పడుతున్న అన్నదాతలు.
ఊట్కూర్ మండలంలో వర్షాలు కురిసి పలువురు రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కొరత కారణంగా వ్యవసాయ పనులు చేపట్టేందుకు అన్నదాతలు ట్రాక్టర్ల యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. డీజిల్ కోసం గంటల తరబడి బంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. గత రెండు రోజుల నుండి డీజిల్ కొరత కారణంగా ట్రాక్టర్ల యజమానులు వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్లకపోవడంతో రైతులు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. డీజిల్ కొరత ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలువినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పెట్రోల్ డీజిల్ కొరత తీర్చాలని పలువురు వాహనదారులు, మండల ప్రజలు రైతులు కోరుతున్నారు.
