CM Revanth Reddy | నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు..

CM Revanth Reddy | నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు..
ఆసిఫాబాద్ (కోఠారి): మా ప్రభుత్వంలో ఆదిలాబాద్‌కే తొలి ప్రాధాన్యం అని చెప్పాం. ఆదివాసీల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం అంకితభావంతో పనిచేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనతో పాటు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కోఠారి గ్రామంలో పర్యటించిన ఆయన, ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాల మహోత్సవంలో పాల్గొన్నారు. అలాగే, రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతీరుపై లబ్ధిదారులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యలను మహిళలు సీఎం దృష్టికి తీసుకురాగా.. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి, యుద్ధప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాలని అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్‌ను గట్టిగా ఆదేశించారు.
సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన అందరూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. లబ్ధిదారులు నెల రోజుల్లోనే ఇల్లు కట్టుకునేలా సరికొత్త సాంకేతికతను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తండాల్లో ఉన్న అర్హులైన గిరిజనులందరికీ సొంత ఇళ్లు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. తల తాకట్టు పెట్టి అయిన ఇందిరమ్మ ఇళ్లకు నిధులు కేటాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి తాము అమలు చేస్తున్న వినూత్న పథకాలే నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, ఏకంగా వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులను చేసినట్లు వివరించారు. అంతేకాకుండా, మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం డ్వాక్రా మహిళా సంఘాలకు అందించే రుణ సౌకర్యాన్ని రూ. 10 లక్షల వరకు పెంచినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్.. మహారాష్ట్ర సీఎం నిర్లక్ష్యంపై ఫైర్
తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ విషయంలో పొరుగు రాష్ట్ర వైఖరిని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. “పోలవరం ప్రాజెక్ట్ కోసం తెలంగాణకు చెందిన 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. మరి తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 2 వేల ఎకరాల భూములను ఇవ్వలేదా?” అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ భూములకు సంబంధించి తాము ఎన్ని లేఖలు రాసినా మహారాష్ట్ర సీఎం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి, మహారాష్ట్ర సీఎం తో మీటింగ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
జూన్ 15 తర్వాత బీజేపీ ఆఫీస్ దగ్గరే తేల్చుకుంటాం..
రాష్ట్రంలో రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 75 లక్షల క్వింటాళ్ల వడ్లను కొంటున్నామని, ఆ ధాన్యంతో పాటు వడ్లు, జొన్నలు, మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా సేకరించాలని డిమాండ్ చేశారు. “సత్రంలో పెట్టే భోజనానికి.. నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ అవసరం లేదు. రాష్ట్రం కొనే పంటను కేంద్రం తీసుకునేలా కిషన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి” అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పంటను తీసుకోకపోతే.. జూన్ 15 తర్వాత బీజేపీ ఆఫీస్ ముట్టడించి అక్కడే తేల్చుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పవర్‌ఫుల్ అల్టిమేటం జారీ చేశారు. ఈ విషయంలో కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోకపోతే, ఆయన రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జూన్ 15 తర్వాత దీనిపై పూర్తి కార్యాచరణ ప్రకటిస్తామని సీఎం స్పష్టం చేశారు.
