మేడిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
మేడిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
- లారీ డ్రైవర్ సజీవ దహనం
నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ : నిర్మల్ మండలం మేడిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి–44 (NH-44)పై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నాగపూర్ నుంచి ఆలుగడ్డల లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ, టైర్ పంక్చర్ కావడంతో రహదారిపై ఆగి ఉన్న మరో లారీని మేడిపల్లి గ్రామం వద్ద వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీలకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి.
ఈ ఘటనలో లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు. మృతుడిని అదిలాబాద్ జిల్లా సోనాల మండలానికి చెందిన జావారి సింగ్గా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
