RCB | విజయోత్సవం పేరుతో వీరంగం…

RCB | విజయోత్సవం పేరుతో వీరంగం…

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన నేపథ్యంలో కర్నూలు నగరంలో నిర్వహించిన విజయోత్సవాలు కొందరి అత్యుత్సాహంతో విధ్వంసకరంగా మారాయి. రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేసిన ఘటనపై టూ టౌన్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు నిర్వహించారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు పరిశీలించారు.

ఈ దర్యాప్తులో విధ్వంసానికి పాల్పడిన 18 మంది వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులను టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ప్రజా ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియజేయడంలో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

విజయోత్సవాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించబోమని టూ టౌన్ సీఐ శ్రీధర్ హెచ్చరించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆస్తులను ధ్వంసం చేయడం నేరమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పండుగలు, క్రీడా విజయోత్సవాలు, ఇతర వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలను సహించబోమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా వ్యవస్థ నేరాల నియంత్రణలో కీలకంగా మారిందని పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply