వేలాడే విద్యుత్ తీగలతో ప్రజల ప్రాణాలకు ముప్పు

20 ఏళ్లుగా పట్టించుకోని విద్యుత్ శాఖ..

వెంటనే చర్యలు తీసుకోకపోతే కార్యాలయం ముట్టడిస్తాం: సీపీఐ(ఎంఎల్) హెచ్చరిక

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పురపాలక సంఘ పరిధిలోని నూరా మసీదు ఎదుట, వరుస వాహనాల విక్రయశాల వెనుక భాగంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆయన ఆరోపించారు.

పట్టణంలోని పలు ప్రాంతాల్లో పార్టీ ఆధ్వర్యంలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నందికొట్కూరు గ్రామ పంచాయతీగా ఉన్న కాలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, తీగలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని తెలిపారు. పట్టణం అభివృద్ధి చెందినా విద్యుత్ శాఖ మాత్రం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదని విమర్శించారు.

ప్రజలు అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి వచ్చే తీగలను తొలగించామని అధికారులు చెబుతున్నప్పటికీ, వాటి నుంచి ఇప్పటికీ నిప్పురవ్వలు వస్తున్నాయని ఆరోపించారు.

ఇటీవల ఒక ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు స్తంభం నుంచి కిందపడి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని గుర్తుచేశారు. విద్యుత్ తీగలు ఊయలల్లా ఊగుతున్నాయని, ఎప్పుడు ఎవరి ప్రాణం తీస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు, వృద్ధులు, వాహనదారులు ప్రతిరోజూ ప్రాణభయంతో జీవిస్తున్నారని అన్నారు.

ఉప కార్యనిర్వహణ అధికారి, సహాయ కార్యనిర్వహణ అధికారి స్వయంగా కాలనీని పరిశీలించి పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించకపోతే సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట నిరవధిక ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు టి. నరసింహులు, వేల్పుల ఏసన్న, మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎస్‌బీబీ శిరీష, విప్లవ యువజన సంఘం నాయకులు గణేష్, సురేష్, స్థానికులు మహబూబ్ బాషా, అస్లం బాషా, ఎం. శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply