ఆక్రమణకు గురైన చెరువుల భూములు కాపాడాలి..

ఆక్రమణకు గురైన చెరువుల భూములు కాపాడాలి..

మూడు చెరువుల భూములు కబ్జా..

సాగునీరు, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం

జన్నారం, ఆంధ్రప్రభ : మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన మూడు చెరువుల భూములు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని వెంటనే కాపాడాలని గ్రామ రైతులు సముద్రాల శంకర్, ఆకుల భీమన్న, సత్యవ్వ కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు.

గ్రామంలోని సర్వే నంబర్లు 159, 160, 161లో ఉన్న అల్లంవారి చెరువు విస్తీర్ణం 20 ఎకరాలు ఉండగా, ఆక్రమణల కారణంగా ప్రస్తుతం కేవలం 2 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. అలాగే గొల్లకుంట చెరువు 10 ఎకరాల విస్తీర్ణం నుంచి 3 ఎకరాలకు తగ్గిపోయిందన్నారు. ఊరకుంట చెరువు భూమి పూర్తిగా ఆక్రమణకు గురైందని పేర్కొన్నారు.

గ్రామానికి చెందిన నలుగురు నాయకులు ఈ మూడు చెరువుల భూములను కబ్జా చేసి అనుభవిస్తున్నారని ఆరోపించారు. చెరువులు ఆక్రమణకు గురికావడంతో గ్రామంలోని బావుల్లో నీటి మట్టం పడిపోయిందని, పశువులకు తాగునీటి కొరత ఏర్పడిందని తెలిపారు. అలాగే ఆయకట్టు భూములకు సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు ఎండిపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న వానాకాలంలో కూడా ఆయకట్టు భూములు సాగునీరు లేక నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.

చెరువుల ఆక్రమణలపై గతంలో మంచిర్యాల ఆర్డీవో, జన్నారం తహసీల్దార్‌లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని మూడు చెరువుల భూములను సర్వే చేయించి, హద్దులు నిర్ణయించి, ఆక్రమణలను తొలగించి కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో రైతులు ఆకుల రజిత, బాల్త సువర్ణ, బాల్త ఎంకవ్వ, హబీబా బేగం, ఎం.డి. లతీఫా తదితరులు పాల్గొన్నారు.