ఎస్ఐ దూషించాడంటూ మహిళ ఆత్మహత్యాయత్నం

ఎస్ఐ దూషించాడంటూ మహిళ ఆత్మహత్యాయత్నం

“ఏమైనా తాగి చావు” అన్నాడంటూ ఆరోపణలు..
ఉన్నతాధికారుల జోక్యం కోరుతున్న కుటుంబ సభ్యులు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండల పరిధిలోని ఉడుమలకుర్తి గ్రామం, సోమలవాండ్లపల్లికి చెందిన వై. మమత అనే మహిళ పోలీసు ఎస్ఐ తనను దుర్భాషలాడాడని ఆరోపిస్తూ మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కేసు విషయమై మమతను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్ఐ చెన్నయ్య అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు.

తాను ఎందుకు అలా మాట్లాడుతున్నారని ప్రశ్నించగా, “నీకు దిక్కున్న చోట చెప్పుకో” అంటూ హెచ్చరించారని బాధితురాలు తెలిపింది. అంతేకాకుండా, “మాకు న్యాయం చేయమంటే మీరు ఇలా మాట్లాడితే ఎలా సార్” అని అడిగినప్పుడు, “ఏమైనా తాగి చావు” అని వ్యాఖ్యానించాడని మమత ఆరోపించింది. ప్రత్యర్థుల వద్ద నుంచి లంచం తీసుకుని తమ పట్ల అన్యాయంగా ప్రవర్తించారని కూడా ఆమె ఆరోపించింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మమత పురుగుల మందు తాగగా, గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

“జరగరానిది జరిగి ఉంటే మా కుటుంబం రోడ్డున పడేది” అని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పై ఉన్నతాధికారులు స్పందించి, నిజానిజాలు విచారించి సంబంధిత ఎస్ఐపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే.. సంబంధిత పోలీసు అధికారుల మాత్రం ఈ సంఘటన పై ఇంకా స్పందించలేదు.

Leave a Reply