31stMayeditorial | ప్రవాస భారతీయులకు ఊరట కలిగించిన యూటర్న్

31stMayeditorial | ప్రవాస భారతీయులకు ఊరట కలిగించిన యూటర్న్
31stMayeditorial | ప్రవాస భారతీయులకు ఊరట కలిగించిన యూటర్న్
వలసదారుల్లో గందరగోళానికి అడ్డుకట్ట
నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన హెచ్చరిక
భారతీయుల పాత్రను గుర్తించిన అమెరికా
31stMayeditorial | అమెరికాలో శాశ్వత నివాస హక్కు నిబంధనల విషయంలో ట్రంప్ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం ప్రవాస భారతీయులకు ఊరట కలిగించే విషయం. గ్రీన్ కార్డుల దరఖాస్తుల కోసం తాత్కాలిక వలసదారులు దరఖాస్తులు సమర్పించడానికి తిరిగి స్వదేశం వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవా సంస్థ ఈ నెల చేసిన ప్రకటన వలసదారుల్లో తీవ్ర ఆందోళనను, గందరగోళాన్ని సృష్టించింది. దీని వల్ల వేలాది వలసదారులకు అదనపు వ్యయప్రయాసలే కాకుండా, గుండెలపై భారం పడింది.
ఇప్పుడు ఆ అవసరం లేదనీ, ఇదేమీ విస్తృతస్థాయి విధాన మార్పేమీ కాదని అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవా సంస్థ పేర్కొనడం వలసదారులలో ఆందోళనకు అడ్డుకట్ట పడినట్టయింది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఏటా వేలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. వలసదారుల్లో అత్యధికులు తెలుగువారే కావడం గమనార్హం. గ్రీన్ కార్డు ప్రక్రియను అమెరికాలో ఉండి పూర్తి చేయాలా? ఆ అవసరం లేదా అనేది ఇమ్మిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారని ఆ సంస్థ స్పష్టం చేసింది.
అమెరికాలో గ్రీన్ కార్డు విషయంలో తెలుగువారిలో అత్యధికులు ఒక హోదాలా భావిస్తారు. తమ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నంతవరకూ వలసదారులు అమెరికాలో ఉండేందుకు ఎటువంటి అభ్యంతరం ఉండదని పౌరసత్వ, వలసదారుల సేవా సంస్థ వివరణ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో రీతిలో ప్రకటనలు చేస్తున్న దృష్ట్యా, ఇందుకు సంబంధించి మార్పులు ఏవైనా జరిగాయేమోనని వలసదారులు ఆందోళన చెందుతున్నారు. 2024లో అమెరికా సుమారు 14 లక్షల మందికి గ్రీన్ కార్డులను మంజూరు చేసింది. వీరిలో 8 లక్షల 20 వేల మంది అడ్జెస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియ ద్వారా శాశ్వత నివాసం పొందారు.

అమెరికాలో శాశ్వత నివాసం గల వారు భారత్‌లో ప్రతి ఇంటిలో ఒకరో ఇద్దరో ఉన్నారు. అయితే, తాత్కాలికంగా అమెరికాకు వచ్చిన వారు తమ గడువు ముగిసిన వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆ సంస్థ ప్రతినిధి జాన్ కహ్లర్ స్పష్టం చేశారు. అయితే, చాలా మంది కాలపరిమితి పూర్తయిన తర్వాత కూడా అమెరికాలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు చేసిన ప్రకటన వారికి వర్తిస్తుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులకు మొదటి నుంచి ఉన్న అధికారాలను గుర్తు చేయడం కోసమే పౌరసత్వ, వలసదారుల సేవా సంస్థ ఆ మెమోను జారీ చేసిందని కహ్లర్ తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే, అమెరికా జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు ఉన్న కేసుల్లో వెసులుబాటు కల్పిస్తామని ఆయన చెప్పారు.
అమెరికాలో స్థిరపడిన భారతీయుల్లో అత్యధికులు అక్కడి జాతీయ ప్రయోజనాలు కాపాడుతున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా అంగీకరించారు. అమెరికా ప్రయోజనాలను కాపాడేవారి జోలికి వెళ్లబోమని ఆయన పలుసార్లు స్పష్టం చేశారు. గ్రీన్ కార్డు నిబంధనల విషయంలో గందరగోళం సృష్టించడానికి ఇలాంటి వార్తలను పుట్టిస్తుంటారు. ఆ విషయం కూడా ఆయన తన ప్రకటనల్లో పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా నిబంధనల్లో మార్పులు ఏవీ లేవని పౌరసత్వ, వలసదారుల సేవా సంస్థ వివరణ ఇవ్వడంతో గందరగోళం తొలగిపోయింది.
