పోషకాహారం, ప్రాథమిక విద్యకు అంగన్‌వాడీలు వేదిక

సంగారెడ్డి, ఆంధ్రప్రభ : చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి చిన్నారిని అంగన్‌వాడీల్లో నమోదు చేయించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలితా కుమారి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ మండలంలోని తొగర్పల్లిలో శనివారం నిర్వహించిన “అమ్మ మాట.. అంగన్‌వాడి బాట” కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి అంగన్‌వాడీ సేవల ప్రాధాన్యత, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో డీసీపీఓ, సఖి కేంద్రం కోఆర్డినేటర్ కల్పన, గ్రామ సర్పంచ్ దివ్యవాణి ప్రశాంత్ గౌడ్, సూపర్వైజర్, సీడీపీఓ, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ మహిళలు పాల్గొన్నారు. అనంతరం అధికారులు అంగన్‌వాడీ కేంద్రంలో కొత్తగా నమోదు కావాల్సిన చిన్నారుల ఇళ్లను సందర్శించి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేయించడం ద్వారా వారికి పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక విద్య వంటి సేవలు అందుతాయని వివరించారు. ప్రతి చిన్నారి ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.
