Amaravati Bollywood | అమరావతిపై బాలీవుడ్ ఆసక్తి

Amaravati Bollywood | అమరావతిపై బాలీవుడ్ ఆసక్తి

Amaravati Bollywood | రాజధాని నిర్మాణం ఆగదని మంత్రి నారాయణ స్పష్టం
ఇప్పటివరకూ 114 సంస్థలకు 1269 ఎకరాల కేటాయింపు
భూ కేటాయింపులకు ఫైనాన్షియల్ షీట్, బ్యాలెన్స్ షీట్ తప్పనిసరి
అమరావతి నిర్మాణాలకు ఆటంకం లేదని ప్రభుత్వం భరోసా

Amaravati Bollywood | అమరావతి, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాజధాని అమరావతిపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆసక్తి చూపుతోంది. భూముల కేటాయింపునకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. అమరావతిలో ఇప్పటివరకు మొత్తం 114 సంస్థలకు భూములు కేటాయించినట్లు పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. వీటిలో చాలా సంస్థలు తమ నిర్మాణాలను ప్రారంభించాయని చెప్పారు.

రాజధానిలో భూముల కేటాయింపునకు సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ఆన్‌లైన్‌లో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, సంధ్యారాణితో పాటు సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు హాజరయ్యారు. సమావేశం వివరాలను మంత్రి నారాయణ సచివాలయంలో మీడియాకు వెల్లడించారు.

అమరావతిలో ఇప్పటివరకూ 114 సంస్థలకు 1269 ఎకరాలు కేటాయించాం. వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. కేటాయించిన వాటిలో బ్యాంకులు 16, ఉద్యోగుల ఇళ్ల కోసం 8 బ్యాంకులకు, విద్యాసంస్థలు 22, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 13, కేంద్ర ప్రభుత్వ సంస్థలు 17, వైద్య సంస్థలు 7, హోటల్స్ 14, క్రీడా సంస్థలు 2, ఇతర సంస్థలు 5 ఉన్నాయని వివరించారు.

20 సంస్థలు నిర్మాణాలు కొనసాగిస్తున్నాయని, మరో 9 సంస్థలు నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. 18 సంస్థలు నగదు చెల్లించే దశలో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. 25 సంస్థలు అగ్రిమెంట్ దశలో, మరో 38 సంస్థలు డిజైన్ల దశలో ఉన్నట్లు చెప్పారు.

భూములు కేటాయించిన 114 సంస్థల్లో 3 సంస్థలు వేర్వేరు కారణాలతో రద్దు చేసుకున్నాయి. వీటిలో జీఆర్టీ హోటల్స్, స్నెండర్, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఉన్నాయన్నారు. ఐఆర్‌సీటీసీ కొత్తగా ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదని తీసుకున్న పాలసీ నిర్ణయంలో భాగంగా కేటాయింపును రద్దు చేసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

ఇక భూముల కేటాయింపు కోసం 16 సంస్థలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఆయా సంస్థలకు కేటాయింపులపై ఆసక్తి వ్యక్తీకరణ లేదా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ద్వారా ముందుకు వెళ్తామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో జీవీ ఎస్టేట్స్ హోటల్స్‌కు గతంలో కేటాయించిన స్థలానికి బదులు వేరే ప్రాంతంలో కేటాయించామని, హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీకి బ్రాండ్ మార్పునకు ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు.

ఏపీ పబ్లిక్ లైబ్రరీస్, తెలుగు కల్చరల్ సెంటర్, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థలకు గతంలో కేటాయించిన విస్తీర్ణంలో మార్పులు చేయడంతో పాటు స్థలం కూడా మార్పు చేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులతో రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని పనుల్లో ఉపయోగిస్తున్న మెషినరీకి డీజిల్ కొరత లేకుండా ఆయా కాంట్రాక్ట్ సంస్థలు చర్యలు తీసుకున్నాయని మంత్రి చెప్పారు.

అమరావతి నిర్మాణాలకు ఆటంకం లేదు

దేశంలో భారీ నిర్మాణాలకు కొంత విరామం ఇవ్వాలని.. అమరావతి రాజధాని నిర్మాణం మాత్రం కొనసాగిస్తామన్నారు. ఇక్కడ నిర్మాణాల్లో కొన్ని తుది దశకు చేరుకోగా.. మరికొన్ని మధ్యలో ఉన్నాయన్నారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు ఆశతో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చారని, గత ఐదేళ్లలో అమరావతి ఆగిపోయిందని, ప్రస్తుతం వేగంతో నిర్మాణం కొనసాగుతుందన్నారు.

అమరావతిలో తమకు భూ కేటాయింపులు చేయాలని ముంబై నుంచి సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు కోరారని మంత్రి నారాయణ తెలిపారు. అయితే ఎవరికి భూములు కేటాయించాలన్నా ముందుగా డీపీఆర్‌తో పాటు వారి ఆర్థిక పరిస్థితి, బ్యాలెన్స్ షీట్, ఫైనాన్షియల్ షీట్ చూసి తర్వాత నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఒకసారి భూ కేటాయింపులు చేసిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో నిలిపివేస్తే ఇబ్బందులు వస్తాయని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply