చిరుత పులి దాడిలో మేక మృతి..

సిరికొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా సిరికొండ, కమ్మర్‌పల్లి రేంజ్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం చిరుతపులి దాడిలో మేక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

తాటిపల్లి గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన మాలవత్ రాజుకు చెందిన మేకపై చిరుతపులి దాడి చేసి హతమార్చింది. మాలవత్ రాజు జీవనోపాధి కోసం ప్రధానంగా మేకల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. ఈ ఘటనతో అతనికి సుమారు రూ.15 వేల మేర నష్టం వాటిల్లిందని గ్రామస్థులు తెలిపారు. బాధితుడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఎఫ్‌ఆర్‌వో వివరణ

ఈ ఘటనపై అటవీ శాఖ అధికారుల స్పందన కోరగా, ఎఫ్‌ఆర్‌వో కె. నర్సింగ్ రావు మాట్లాడుతూ అడవిలో మేత కోసం మేకలను ప్రవేశపెట్టడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.

అడవిలోకి మేత కోసం వెళ్లిన మేక చిరుత దాడికి గురై మృతి చెందిన నేపథ్యంలో, ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం మేకలకు నష్టపరిహారం అందించే అవకాశం లేదని వివరించారు. అయితే, ఇతర అర్హత కలిగిన సందర్భాల్లో నిబంధనల మేరకు నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Leave a Reply