covid-alert | రాష్ట్రం మొత్తం అలర్ట్!
జిల్లాలకు వైద్య, ఆరోగ్యశాఖ అత్యవసర ఆదేశాలు..
పర్యవేక్షణ, పరీక్షలు, వైద్య సంసిద్ధత పెంచాలని సూచన
covid-alert | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కడప జిల్లాలో కోవిడ్-19 కేసులు వెలుగులోకి రావడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు, జిల్లా పర్యవేక్షణ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, సంబంధిత అధికారులకు అత్యవసర అప్రమత్తత ఆదేశాలు జారీ చేసింది. పర్యవేక్షణ, పరీక్షలు, నివేదికలు, వైద్య సంసిద్ధతను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర పర్యవేక్షణ విభాగం (ఐడీఎస్‌పీ) ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలతో వచ్చే ప్రతి రోగిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా అనారోగ్యాలు (ఐఎల్‌ఐ), తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు (ఎస్‌ఏఆర్‌ఐ) ఉన్నవారి నుంచి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నమూనాలు సేకరించి వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్రయోగశాలల్లో నిర్ధారణ అయిన ప్రతి కోవిడ్ కేసును ఆలస్యం లేకుండా సమగ్ర ఆరోగ్య సమాచార వేదికలో నమోదు చేయాలని సూచించింది.
జిల్లాల్లో శ్వాసకోశ వ్యాధుల సమూహ కేసులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా అసాధారణంగా కేసులు పెరిగితే వెంటనే విచారణ చేపట్టి నియంత్రణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు, నమూనాల సేకరణ సామగ్రి, వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియం, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీీపీఈ కిట్లు), మాస్కులు, క్రిమిసంహారకాలు, ఆక్సిజన్, అత్యవసర మందులు తగినంతగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, ఆక్సిజన్ పడకలు, అత్యవసర చికిత్స విభాగాలు, వెంటిలేటర్ సౌకర్యాలు, రిఫరల్ వ్యవస్థ సిద్ధంగా ఉన్నాయో లేదో వెంటనే సమీక్షించాలని ఆదేశించింది. ఆరోగ్య సిబ్బంది సంక్రమణ నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అవసరమైతే కోవిడ్ పాజిటివ్ నమూనాలను జన్యు విశ్లేషణ కోసం గుర్తించిన ప్రయోగశాలలకు పంపించాలని తెలిపింది.
ప్రజల్లో చేతుల పరిశుభ్రత, శ్వాస మర్యాదలు పాటించేలా, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అదే సమయంలో అనవసర భయాందోళనలు సృష్టించకుండా ప్రజారోగ్య సమాచారాన్ని అందించాలని పేర్కొంది. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యాన్ని సిద్ధంగా ఉంచాలని కూడా ఆదేశించింది.
రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా కోవిడ్ కేసులు, సమూహ వ్యాప్తి, ఆసుపత్రుల్లో చేరికలు లేదా మరణాలు అసాధారణంగా పెరిగితే సాధారణ నివేదికల కోసం వేచి చూడకుండా వెంటనే రాష్ట్ర పర్యవేక్షణ విభాగానికి సమాచారం అందించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాలు పూర్తి స్థాయి సంసిద్ధతతో ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది.
