ఎన్‌ఎస్‌పీ భూముల ఆక్రమణలపై స్థానికుల ఆందోళన

ఎన్‌ఎస్‌పీ భూముల ఆక్రమణలపై స్థానికుల ఆందోళన

ఖమ్మం సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ: ఖమ్మం నగరంలోని మమతా రోడ్డు, శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 7లో ఎన్‌ఎస్‌పీ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, విద్యుత్ చౌర్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన ఎన్‌ఎస్‌పీ మిగులు భూములను కొందరు ఆక్రమించి షెడ్లు, గదులు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఆక్రమిత స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడమే కాకుండా, అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తెలంగాణ ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్, అర్బన్ తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు.

మమతా హాస్పిటల్‌–గొల్లగూడెం రోడ్డులోని శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 7లో ఓ వ్యక్తి ఎన్‌ఎస్‌పీ కాల్వ మిగులు భూమిపై రెండు గదులు నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ నిర్మాణాల్లో అక్రమంగా విద్యుత్ వినియోగం జరుగుతోందని వారు పేర్కొన్నారు.

ఫిర్యాదులు చేసిన స్థానికులపై ఆక్రమణదారులు దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను బహిరంగంగా ఆక్రమించినా, అక్రమ నిర్మాణాలు చేసినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.

కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు స్వలాభం కోసం ఆక్రమణదారులకు మద్దతు ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్‌ఎస్‌పీ మిగులు భూములపై కన్నేసిన కొందరు బినామీల పేర్లతో కబ్జాలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు.

ఆక్రమిత నిర్మాణాల కారణంగా సమీపంలో నివసించే మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు తెలిపారు. పలుమార్లు సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు.

జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఎన్‌ఎస్‌పీ కాల్వ పరిధిలోని ఆక్రమణలపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించి, విద్యుత్ చౌర్యంపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply