రాజకీయాల్లో యువతకు టీడీపీ అవకాశాలు: నారా లోకేష్

రాజకీయాల్లో యువతకు టీడీపీ అవకాశాలు: నారా లోకేష్
విజయవాడ, ఆంధ్రప్రభ: యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని, వారికి తెలుగుదేశం పార్టీ అనేక అవకాశాలు కల్పిస్తోందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ అన్నారు. మహానాడు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు చరణ్ నారా లోకేష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, నేటి యువతకు రాజకీయాల్లో రాణించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చే యువతకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు.
యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు పార్టీ వేదికగా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
