అంతరించిపోతున్న చిందు యక్షగాన కళను కాపాడాలి

అంతరించిపోతున్న చిందు యక్షగాన కళను కాపాడాలి
చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో గత ఐదు రోజులుగా చిందు యక్షగాన కళాకారుడు గడ్డం ధనంజయ ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గురువారం గడ్డం ధనంజయ మాట్లాడుతూ, గ్రామాల్లో చిందు యక్షగాన కళాకారుల ప్రదర్శనలు క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కళాకారుల కుటుంబాలు జీవనోపాధి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
తిర్మలాపూర్‌లో సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రదర్శనలు ఇచ్చామని, మళ్లీ ఇప్పుడు ఆరు ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సతీ సావిత్రి నాటకంతో ఈ కళా ప్రదర్శనలు ముగుస్తాయని తెలిపారు. తమ తాతముత్తాతల కాలం నుంచి వారసత్వంగా ఈ కళా ప్రదర్శనలు ఇస్తున్నామని ధనంజయ పేర్కొన్నారు. రంగస్థలంపై ప్రదర్శనలు ఇస్తూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.
నేటి ఆధునిక కాలంలో జీవన విధానం మారడంతో ఈ ప్రాచీన కళ అంతరించిపోయే ప్రమాదంలో ఉందని అన్నారు. చిందు యక్షగాన కళాకారులను ఆదుకోవడానికి, సంప్రదాయ కళలను కాపాడడానికి ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు.
