ప్రయాణ మధ్యలో విషాదం..

ప్రయాణ మధ్యలో విషాదం..
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన ఓ యువకుడు APSRTC లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన గురువారం విషాదాన్ని నింపింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈతోడు గ్రామానికి చెందిన యువకుడు తనకల్లు నుంచి అనంతపూర్‌కు వెళ్లేందుకు APSRTC లగ్జరీ బస్సు ఎక్కాడు. ప్రయాణం సజావుగా కొనసాగుతుండగా, బస్సు నల్లచెరువు ప్రాంతానికి చేరుకునే సమయానికి అతడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు.
యువకుడు ఛాతినొప్పితో బాధపడుతూ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గమనించిన ప్రయాణికులు వెంటనే బస్సు సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్ బస్సును నల్లచెరువు బస్టాండ్ వద్ద ఆపి, స్థానికుల సహాయంతో వైద్య సహాయం అందించే ప్రయత్నం చేశారు.
అయితే అప్పటికే యువకుడు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. యువకుడి మృతితో ఈతోడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
