28thMayeditorial | కాంగ్రెస్ అధిష్టానానికి పెరుగుతున్న సంక్షోభం

28thMayeditorial | కాంగ్రెస్ అధిష్టానానికి పెరుగుతున్న సంక్షోభం
28thMayeditorial | కర్నాటకలో రాజకీయ సమీకరణాలు
సిద్ధరామయ్య వ్యూహాత్మక మెలిక
డీకే శివకుమార్ ఒత్తిడి–పవర్ బ్యాలెన్స్
అహిందా–ఒక్కలిగ వర్గాల సమీకరణ
28thMayeditorial | కర్నాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం నాయకులు తగువులు పడటం గతంలో అంటే ఇందిరాగాంధీ హయాంలో తరచుగా జరిగేది. అందుకే కర్నాటకం అనే నానుడి స్థిరపడింది. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రులను తరచుగా మార్చడం అనే పద్ధతికి ఆమె స్వస్తి చెప్పారు. బీజేపీ హయాంలో కూడా ముఖ్యమంత్రుల మార్పు తరచుగా జరిగేది.
ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిపాలనా పరంగా సమర్థుడు. ఆయన కురుబా సామాజిక వర్గానికి చెందినవారు. సీనియర్ నాయకుడు కూడా. ఆయనకు డిప్యూటీగా ఉన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడటంతో అధిష్టానం ఇరువురికి చెరి రెండున్నర సంవత్సరాల పాటు ఆ పదవిని నిర్వహించేట్టు రాజీ కుదిర్చింది. సిద్ధరామయ్య గడువు పూర్తి అయినా పదవిలో కొనసాగుతున్నారు.
శివకుమార్‌కు అంగబలం, అర్థబలం ఉంది. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించాలని ఆయన కొద్ది నెలలుగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయనకు ఇతర రాష్ట్రాల్లో పార్టీ పనులు అప్పగిస్తూ పార్టీలో అధిష్టానం తగిన ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. శివకుమార్ తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకుని వెళ్లారు.
అయినప్పటికీ సిద్ధరామయ్య చతురోపాయాలతో ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. శివకుమార్‌కు చెందిన ఒక్కలిగ సామాజిక వర్గం ఒత్తిడిపై ఎట్టకేలకు సిద్ధరామయ్య గద్దె దిగేట్టు అధిష్టానం ఒప్పించింది. కొద్ది రోజులుగా ఈ విషయమై మంతనాలు జరుగుతున్నాయి.
అయితే సిద్ధరామయ్య తన రాజకీయ చాణక్యంను ఉపయోగించి తాను గద్దె దిగేందుకు మెలిక పెట్టారు. రాష్ట్రంలో ఎక్కువ జనాభా గల అహిందా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే తన వారసునిగా ఎంపిక చేయాలని పట్టుబడుతున్నారు. అహిందా అనే సామాజిక వర్గం మైనారిటీలు, వెనుకబడిన తరగతులకు చెందినది. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన కాంగ్రెస్ నాయకుడు దేవరాజ్ అర్స్ ఈ వర్గానికి చెందినవారే. ఈ వర్గం ఓటు బ్యాంకు కూడా ఎక్కువే.
అహిందా సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇప్పిస్తానని సిద్ధరామయ్య హామీ ఇవ్వడమే కాకుండా ఇంతకాలం వారి మద్దతును పొందుతూ వచ్చారు. అయితే ఈ సామాజిక వర్గానికి అర్థబలం లేకపోవడం ఒక లోపంగా మారింది. మరోవైపు ఒక్కలిగ సామాజిక వర్గానికి అర్థబలంతో పాటు అంగబలం కూడా బలంగా ఉంది. ఈ సామాజిక వర్గం వారు పేరున్న విద్యా సంస్థలను నడుపుతున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ కానీ, మరే పార్టీ కానీ డబ్బున్న వర్గాలపై ఆధారపడక తప్పదు. అందువల్ల డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీలో బలమైన వర్గం ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక శివకుమార్‌కు ఈ విషయంలో హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సిద్ధరామయ్య ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఆయన సోదరునికి మంత్రి పదవి ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్టు కూడా ప్రచారం సాగుతోంది. మొత్తం మీద కర్నాటకలో ముఖ్యమంత్రి పీఠం కాంగ్రెస్ అధిష్టానానికి సమస్యలు సృష్టిస్తోంది. సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ఈ విషయాలను పట్టించుకోవడం లేదు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘనవిజయం సాధించడానికి విస్తృతంగా ప్రచారం చేసిన ప్రియాంకపైనే సోనియా ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
