పేదల ఇళ్లకే బుల్‌డోజర్లా?

పేదల ఇళ్లకే బుల్‌డోజర్లా?

  • బడాబాబుల కబ్జాలకు రెడ్‌ కార్పెట్టా?
  • ఖమ్మంలో రెవెన్యూ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

ఖమ్మం, ఆంధ్రప్రభ: ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్‌ వెంచర్‌లో ఎన్నెస్పీ భూముల కబ్జాలపై ఆంధ్రప్రభలో కథనం ప్రచురితమైన వెంటనే రెవెన్యూ అధికారులు కదిలారు. బుధవారం ఉదయం సంబంధిత అధికారులు ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్వే నంబర్లు 395, 375, 376, 401 పరిధిలోని భూములను పరిశీలించి, అక్కడి నిర్మాణాల వివరాలను సేకరించారు. అయితే ఈ పరిశీలన కేవలం ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకే పరిమితమవుతుందేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న నిర్మాణాలు అప్పటివరకు అధికారుల కంటికి కనిపించలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో భారీ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని నిలదీస్తున్నారు. మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత మాత్రమే కదిలే యంత్రాంగం ప్రజా ప్రయోజనాలను ఎలా కాపాడుతుందో చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేదలు 50 గజాల స్థలంలో చిన్న ఇల్లు నిర్మించుకుంటే యుద్ధ ప్రాతిపదికన బుల్‌డోజర్లు పంపి కూల్చివేసిన విషయాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. అప్పుడు అధికారులు కఠిన చట్టాలు, ప్రభుత్వ భూముల సంరక్షణ అంటూ హడావుడి చేశారని మండిపడుతున్నారు. కానీ ఇప్పుడు కోట్ల విలువైన ఎన్నెస్పీ భూమిలో భారీ కట్టడాలు వెలుస్తున్నా అధికారులు మౌనంగా వ్యవహరించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు లకారం ట్యాంక్‌బండ్‌ సమీపంలో ప్రభుత్వ ఉద్యానవనశాఖ భూమికి ప్రభుత్వం హద్దులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ చేసినా, ప్రైవేట్ వ్యక్తులు దాన్ని ధ్వంసం చేయడం వివాదానికి తెరలేపింది. సర్వే నెంబర్ 94లో ఉన్న 1600 గజాల ప్రభుత్వ భూమిని, ఖానాపురం సర్వే నెంబర్ 120గా మార్చి నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూమి ప్రభుత్వానిదేనని గతంలో కార్పొరేషన్ ఉద్యానవనశాఖకు అందజేసిందని, ప్రభుత్వం ఫెన్సింగ్ సైతం వేసిందని స్థానికులు తెలుపుతున్నారు.

ఈ ధ్వంసానికి త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన ఒక ముఖ్య అధికార పార్టీ నాయకుడు ప్రైవేట్ వ్యక్తులకు అండగా ఉన్నాడని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ప్రైవేట్ వ్యక్తికి మద్దతు తెలిపినప్పటికీ, అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ మాత్రం అది ఖచ్చితంగా ప్రభుత్వ భూమేనని, గతంలో తానే సర్వే చేశానని అధికారులకు తెలపడం ఇక్కడ కొసమెరుపుగా మారింది. ప్రభుత్వ భూముల విషయంలో ఎవరికైనా ఒకే చట్టం అమలు కావాలని, బడాబాబుల అక్రమాలపై కూడా బుల్‌డోజర్లు గర్జిస్తాయా లేదా అని నగర ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply