తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
- జిల్లా కలెక్టర్ హెచ్చరిక
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ:
నాగర్ కర్నూల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సంబంధిత శాఖల అధికారులకు, రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో సివిల్ సప్లై, వ్యవసాయ, రవాణా, రెవిన్యూ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో కలిసి ఆయన కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నందున, ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తూకం, హమాలీ, లోడింగ్, రవాణా వంటి అన్ని ప్రక్రియలను వేగంగా పూర్తిచేయాలని సూచించారు.
అలాగే ధాన్యం కొనుగోలు సమయంలో “తాలు తరుగు” పేరుతో రైతులకు అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే తేమ శాతం, నాణ్యత అంచనా వేయాలని, అదనపు కోతలు విధించడం లేదా రైతులను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయడం సహించబోమన్నారు.
ఇటీవల కొన్ని కొనుగోలు కేంద్రాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రైతుల నుంచి ఫిర్యాదులు రాకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని, అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా సమయానికి లారీలను ఏర్పాటు చేసి తరలించాలని పేర్కొన్నారు. ధాన్యం మిల్లులకు తరలింపులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, తాగునీరు, విద్యుత్, కూర్చునే సదుపాయాలు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండాలని తెలిపారు.
ధాన్యం నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేస్తేనే కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
