ఐకేపీ వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఐకేపీ వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

  • బీజేపీ నాయకుల డిమాండ్

దండేపల్లి ఆంధ్రప్రభ:
దండేపల్లి మండల కేంద్రంలో ఐకేపీ వీఓఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కొనసాగుతున్న సమ్మె శిబిరాన్ని బీజేపీ జిల్లా నాయకులు గోపతి రాజయ్య, మండల నాయకులు కమ్ముల బుచ్చన్న సందర్శించి వీఓఏల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీఓఏలు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. అయితే వారు చేస్తున్న పనికి అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వీఓఏల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని పేర్కొంటూ, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లుగా కనీస వేతనం రూ.20,000 ఇవ్వాలని, సెర్ఫ్ ద్వారా వీఓఏలకు ఐడీ కార్డులు జారీ చేయాలని, ఉద్యోగ భద్రతకు సంబంధించిన జీవోలు విడుదల చేయాలని, హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని కోరారు.

ఎండలను సైతం లెక్కచేయకుండా వీఓఏలు చేస్తున్న పోరాటం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఐకేపీ వీఓఏల సంఘం అధ్యక్షుడు బద్రి సత్తన్న, శ్రీనివాస్, తిరుపతి, అనంతలక్ష్మీ, కనకలక్ష్మీ, భవాని, సరిత, రజిత, సునీత, మంగ, మంజుల, సువర్ణ, భూలక్ష్మీతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.