అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలి

అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలి

పాఠశాల యాజమాన్యాలకు ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ సూచనలు

పాయకాపురం, ఆంధ్రప్రభ : పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతే అత్యంత ముఖ్యమని అజిత్‌సింగ్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన సింగ్‌నగర్ పరిధిలోని పలు పాఠశాలలకు చెందిన బస్సులను స్వయంగా తనిఖీ చేశారు.

విద్యార్థుల రవాణా విషయంలో ఎలాంటి అజాగ్రత్తలు వహించినా సహించేది లేదని, రవాణా శాఖ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ప్రతి పాఠశాల బస్సు సక్రమ స్థితిలో ఉండాలని, ఫిట్‌నెస్ నిబంధనలు వంద శాతం అమలు చేయాలని ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్సులకు సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలు తప్పనిసరిగా అమల్లో ఉండాలని సూచించారు. భారీ వాహనాలు నడపడంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని పేర్కొన్నారు. డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

ప్రతి బస్సులో పనిచేసే స్థితిలో అగ్నిమాపక పరికరం, ప్రథమ చికిత్స పెట్టె ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు సురక్షితంగా బయటకు వచ్చేందుకు అత్యవసర ద్వారం సక్రమంగా పనిచేసేలా చూడాలని స్పష్టం చేశారు.

రవాణా శాఖ సూచించిన వేగ పరిమితిని మించకుండా బస్సులకు స్పీడ్ గవర్నర్లు అమర్చాలని, విద్యార్థులను ఎక్కించడం, దించడం కోసం ప్రతి బస్సులో ఒక సహాయక సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

విద్యార్థుల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఐ ప్రభాకర్, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రయాణించే వాహనాల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

Leave a Reply