వికసిత్ భారత్ గ్రామీణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పెనమలూరు – ఆంధ్రప్రభ : దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ గ్రామీణ కార్యక్రమం దేశంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించే కీలక కార్యక్రమమని అన్నారు,గ్రామీణ ప్రాంతాలకు ఆధునిక సాంకేతికతను అందించడం, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని విస్తరించడం, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడం, విస్తృతంగా మొక్కలు నాటడం వంటి అంశాలకు ఈ కార్యక్రమం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గతంలో ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా నిధులను వినియోగించుకున్న రాష్ట్రాల్లో ఒకటని,ప్రస్తుతం ఉపాధి హామీ కూలీల కనీస వేతనాన్ని రోజుకు రూ.305కు పెంచడం ద్వారా గ్రామీణ కార్మికులకు మరింత భరోసా కల్పించామని పేర్కొన్నారు. సోలార్ ఎనర్జీ,విండ్ ఎనర్జీ,గ్రీన్ ఎనర్జీ, వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు,గ్రామాల్లో స్వచ్ఛమైన విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు, సోలార్ విద్యుత్‌తో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ఛార్జింగ్ సౌకర్యాలు కల్పించడం వంటి కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధికి కొత్త దిశను చూపుతాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో “వికసిత్ భారత్ – వికసిత్ గ్రామం” లక్ష్యాన్ని సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
