Pawankalyan | జనసేనలో మళ్లీ కీలక పాత్ర దక్కే అవకాశం ఉందా..?
Pawankalyan | జనసేనలో మళ్లీ కీలక పాత్ర దక్కే అవకాశం ఉందా..?
Pawankalyan | పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ
Pawankalyan | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. “జేడీ లక్ష్మీనారాయణ నా వెంట కొనసాగి ఉంటే ఈరోజు పార్లమెంట్‌కు వెళ్లేవారేమో కదా” అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి.
జనసేన పార్టీ ఆవిర్భావ దశలో జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి అందించిన మద్దతును పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో సమయం, తీసుకునే నిర్ణయాలు, కలిసి నడిచే వ్యక్తులు ఎంతో కీలకంని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో నిజాయితీ గల అధికారిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జేడీ లక్ష్మీనారాయణకు రాజకీయంగా కూడా మంచి భవిష్యత్తు ఉండేదని పవన్ అభిప్రాయపడ్డారు.
మాజీ ఐపీఎస్ అధికారి అయిన వీవీ లక్ష్మీనారాయణ సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో పలు కీలక అవినీతి కేసుల దర్యాప్తుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా వైఎస్ జగన్‌కు సంబంధించిన అక్రమాస్తుల కేసుల దర్యాప్తు సమయంలో ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. కఠినమైన, నిష్పాక్షిక అధికారిగా ఆయనకు ప్రత్యేక ఇమేజ్ ఏర్పడింది.
అనంతరం స్వచ్ఛ రాజకీయాల లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జేడీ లక్ష్మీనారాయణ, జనసేన పార్టీకి దగ్గరయ్యారు. 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసి ప్రజల్లో మంచి స్పందన పొందినా విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత క్రమంగా పార్టీ కార్యకలాపాలకు దూరమవుతూ రాజకీయాల్లో కూడా పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు.
ఇప్పుడీ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తుపై చర్చకు తెరలేపాయి. జనసేనలో ఆయనకు మళ్లీ ప్రాధాన్యం దక్కుతుందా? తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారా? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
పవన్ వ్యాఖ్యల్లో వ్యక్తిగత అభిమానం, రాజకీయ అవకాశాలపై ఒకింత ఆవేదన కూడా కనిపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు ప్రజల్లో విశేష ఆదరణ పొందిన ఇద్దరు వ్యక్తులు మళ్లీ ఒకే వేదికపై కనిపిస్తారా అనే ఆసక్తి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొంది.
CLICK HERE TO READ Mahanadu2026 | సాంకేతికతతో ‘పసుపు పండుగ’కు శ్రీకారం
