ఖరీఫ్ సీజన్‌కు పచ్చిరొట్టె విత్తనాల పంపిణీ..

ఖరీఫ్ సీజన్‌కు పచ్చిరొట్టె విత్తనాల పంపిణీ..

దండేపల్లిలో రైతులకు సూచనలు

దండేపల్లి, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: దండేపల్లి మండలంలో ఖరీఫ్ సీజన్‌కు గాను పచ్చిరొట్టె పంటలైన జీలుగా, జనుము, పిల్లిపెసర విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ అధికారి గోర్ల అంజిత్ కుమార్ తెలిపారు.

రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని భూసారాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. జీలుగా 30 కేజీల బ్యాగు ధర రూ.2,452, జనుము 40 కేజీల బ్యాగు రూ.3,110, పిల్లిపెసర 20 కేజీల బస్తా రూ.1,970గా నిర్ణయించినట్లు తెలిపారు. ఒక బస్తా విత్తనాలతో సుమారు 2.5 ఎకరాల వరకు సాగు చేయవచ్చని ఆయన వివరించారు.

పచ్చిరొట్టె పంటలను సాగు చేయడం ద్వారా భూసారం పెరుగుతుందని, నేలలో సేంద్రీయ కార్బన్, నత్రజని శాతం పెరిగి తదుపరి పంటలకు అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి ఓఎస్‌ఎస్‌డి‌ఎస్ ద్వారా ఆన్‌లైన్ అనుమతితో విత్తనాలను పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, వ్యవసాయ అధికారులు మౌనిక, సొసైటీ చైర్మన్ లింగన్న, గడ్డం త్రిమూర్తి, ఉప సర్పంచ్ నవీన్, సొసైటీ సీఈఓ విష్ణు, రైతులు మామిడాల లింగన్న, లింగారెడ్డి, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.