అక్షరాంధ్ర వెలుగుబాటలో మరో ముందడుగు..

అక్షరాంధ్ర వెలుగుబాటలో మరో ముందడుగు..
రెండో దశకు కలెక్టర్ శ్రీకారం
విజయవాడ, ఆంధ్రప్రభ : స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక అడుగుగా నిలుస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. 2027 నాటికి ఎన్టీఆర్ జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండో దశ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
మంగళవారం విజయవాడలోని వీఎంసీ కార్యాలయంలో వయోజన విద్య, పంచాయతీరాజ్, మునిసిపల్, విద్య, డ్వామా, సెర్ప్, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2026 జులై 21 నుంచి 2027 మార్చి 15 వరకు రెండో దశ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యత ఉద్యమంలో ఎన్టీఆర్ జిల్లా తొలి ఐదు జిల్లాల్లో స్థానం సంపాదించిందని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో 3.20 లక్షల మంది నిరక్షరాస్యుల్లో ఇప్పటికే దాదాపు లక్ష మంది అక్షరాస్యులయ్యారని కలెక్టర్ వివరించారు. మిగిలిన 87,477 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే దిశగా రెండో దశ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా నిరక్షరాస్యుల గుర్తింపు పూర్తయిందని, వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక అమలు చేయనున్నట్లు చెప్పారు. వాలంటీర్ టీచర్ల రిజిస్ట్రేషన్, యాప్‌లో అప్లోడింగ్, జిల్లా, మండల స్థాయి శిక్షణల అనంతరం 100 గంటల బోధన తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.
ఈ తరగతుల్లో ఫంక్షనల్ లిటరసీతో పాటు ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యతపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆడియో విజువల్స్, క్లాస్రూమ్ బోధన, ప్రాక్టీస్ వర్క్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మార్చి నెలలో అసెస్మెంట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లా, మండల, మునిసిపల్ స్థాయి కమిటీలు సమష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో జిల్లా వయోజన విద్య నోడల్ అధికారి జి. ప్రసాదరావు, డీఈవో ఎల్. చంద్రకళ, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీపీవో పి. లావణ్యకుమారి, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, డ్వామా పీడీ ఎ. రాము పాల్గొన్నారు.
