అర్హులందరికీ పింఛన్లు – ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీపీఐ డిమాండ్

అర్హులందరికీ పింఛన్లు – ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీపీఐ డిమాండ్
నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయంలో సీఎం కు మెమోరాండం – గ్రామాల్లో దరఖాస్తుల సేకరణ
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి మెమోరాండం సమర్పించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ నల్లబెల్లి గ్రామ కార్యదర్శి కనకం సాల్మన్ నాయకత్వంలో గ్రామాల్లో పథకాలు అందని అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు సేకరించి, వాటిని ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి బట్టు సాంబయ్య, నాయకులు పరికి కోర్నేలు, మామిండ్ల పెద్ద ఐలయ్య, కనకం సాల్మన్, కోపెల శ్రీకాంత్ మాట్లాడుతూ…
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500, ఉపాధి కూలీలకు సంవత్సరానికి రూ.12,000, ఆటో కార్మికులకు రూ.12,000, నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 భృతి, రాజీవ్ యువ వికాసం కింద స్వయం ఉపాధి రుణాలు, ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలాలు, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, వికలాంగులకు రూ.6,000, వృద్ధులు మరియు వితంతువులకు రూ.4,000 పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
అయితే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు కాలేదని, గత ప్రభుత్వం అమలు చేసిన పింఛన్లనే కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ సభల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించినప్పటికీ గ్రామాల్లో సరైన ప్రచారం చేయలేదని ఆరోపించారు. దండోరా వేయించకపోవడంతో అనేక మంది పేదలకు సమాచారం చేరలేదన్నారు.
కొన్ని గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు “దరఖాస్తులు అవసరం లేదు” అంటూ అర్హులను వెనక్కి పంపిస్తున్నారనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ప్రజల్లో అవగాహన కల్పించి, ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని, ప్రజలను నిరుత్సాహపరచడం తగదని సీపీఐ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కోపెల సరిత, ఉల్లి రావుల శ్రీలత, పూల కోటపాటి జ్యోతి, త్రికోపెల శారద, పెరుమాండ్ల శోభ, తాడెం అమూల్య, ఎర్రల మానస, దాసరి శ్రావణ్, కనకం అఖిల, వక్కల కటయ్య, శ్రీపతి లక్ష్మయ్య, అనంతలక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
