వడదెబ్బకు వృద్ధురాలు మృతి…

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మధునన్న నగర్‌కు చెందిన సాట్ల అనంత లక్ష్మి (90) అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.
స్థానికుల కథనం ప్రకారం, అనంత లక్ష్మి ఇంట్లో ఒంటరిగా నివసించేది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె మృతి చెందిన విషయం వెంటనే బయటపడలేదు. మంగళవారం స్థానికులు గమనించగా, ఆమె ఇంట్లో మంచంపై మృతదేహంగా కనిపించింది.
ఎండ తీవ్రత కారణంగా సోమవారం మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో ఆమె మృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
అనంత లక్ష్మి భర్త సాట్ల దేవయ్య సుమారు 20 ఏళ్ల క్రితమే మృతి చెందగా, అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఆమెకు సంతానం లేకపోవడంతో చొప్పదండికి చెందిన వాణిని పెంచుకున్నారు. ప్రస్తుతం వాణి తన అత్తవారింటి వద్ద నివసిస్తున్నట్లు తెలిసింది.
వృద్ధురాలు మృతి చెందిన విషయాన్ని స్థానికులు ఆమె పెంపుడు కుమార్తె వాణికి సమాచారం అందించారు. కాంగ్రెస్ నాయకుడు సూరం బానేష్ ఘటన స్థలానికి చేరుకుని అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె పెంపుడు కుమార్తె వాణి ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.
