ఇచ్చోడ మార్కెట్ యార్డులో రెండు షెడ్డుల మంజూరు..

ఇచ్చోడ, ఆంధ్రప్రభ: జూన్ 6లోగా రైతులు మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకొచ్చిన పంటలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఇచ్చోడ మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించిన ఆయన, జొన్నల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రైతులు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన పంటలను త్వరితగతిన కొనుగోలు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

రైతులు పండించిన పంటలను అమ్మకానికి తీసుకొచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఇచ్చోడ మార్కెట్ యార్డుకు రెండు షెడ్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.

మార్కెట్ యార్డులోని గోదాములను రైతుల పంటల నిల్వ కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యం నిల్వలకు సంబంధించి వెంటనే నివేదిక సమర్పించి, వాటిని ఖాళీ చేసే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత మార్కెట్ యార్డ్ సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎంత మేరకు కొనుగోళ్లు జరిగాయి, ఇంకా ఎంత పంట కొనుగోలు చేయాల్సి ఉందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జూన్ 6 నాటికి రైతుల పంట కొనుగోళ్లను పూర్తిచేసి, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.

ఈ పర్యటనలో తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీవో నరేష్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సత్యవతి కోటేష్, స్థానిక సర్పంచ్ కొడప జెలై జాకు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సీఈఓ పండరి, మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply