డ్రా తీశారు.. ‘డబుల్’ ఇళ్లు ఇచ్చారు!

డ్రా తీశారు.. ‘డబుల్’ ఇళ్లు ఇచ్చారు!
- బెల్లంపల్లిలో ఉత్కంఠగా సాగిన లక్కీ డ్రా
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ బుధవారం పట్టణంలోని పద్మశాలి భవన్‌లో అత్యంత పారదర్శకంగా, ఉత్కంఠభరితమైన వాతావరణంలో ముగిసింది. సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా ద్వారా 108 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇళ్లను కేటాయించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం మొత్తం 763 మంది దరఖాస్తు చేసుకోగా, క్షేత్రస్థాయిలో జరిపిన విచారణ అనంతరం 496 మందిని తుది అర్హుల జాబితాలో చేర్చినట్లు వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 10 నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల వారీగా లక్కీ డ్రా నిర్వహించారు.
ఇందులో భాగంగా బీసీ, ఇతర కేటగిరీల కింద 224 మంది అర్హులకు గానూ 71 మందిని, ఎస్సీ కేటగిరీలో 158 మందికి గాను 18 మందిని, మైనార్టీల విభాగంలో 91 మందికి గానూ 13 మందిని, ఎస్టీ కేటగిరీలో 11 మందికి గానూ ఆరుగురిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి మొత్తం 108 ఇళ్లను కేటాయించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యం గానీ, అవినీతి అక్రమాలు గానీ జరగలేదని, 496 మంది అర్హుల ముందే పారదర్శకంగా డ్రా తీసి ఇళ్లను కేటాయించామని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.
అర్హత ఉండి ఇళ్లు రాని వారు ఆందోళన చెందవద్దని, రానున్న కాలంలో మిగిలిన వారికి కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, బెల్లంపల్లి తహసీల్దార్ ఎల్. కృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ అమీద్‌తో పాటు కౌన్సిలర్లు ఎండీ నిజాముద్దీన్, నీలి హారిక, ఢీకొండ పద్మ, నిచ్చకోల వంశీకృష్ణ, బేతి శ్రావణ్, మత్తమారి రాయమల్లు, ఆసాది మధు, ఇప్ప కుమారస్వామి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

