ఐదేళ్ల సేవల సర్పంచులకు ఘన సన్మానం

ఐదేళ్ల సేవల సర్పంచులకు ఘన సన్మానం

రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 19 మంది సర్పంచులు ఇటీవల తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీ నాయకులతో కలిసి సర్పంచులకు పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో సర్పంచ్ ఎన్నికల్లో అనేక దౌర్జన్యాలు జరిగాయని, ఆ సమయంలో పోటీ చేయడానికి కూడా భయం నెలకొన్న పరిస్థితి ఉందన్నారు.

అప్పట్లో టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వచ్చి విజయం సాధించారని తెలిపారు. గెలిచిన సర్పంచులకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధి పనులను అడ్డుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఆందోళనల ద్వారా సర్పంచులకు నిధులు సాధించారని గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలకు మళ్లీ అభివృద్ధి దిశగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు.

సర్పంచులుగా పదవీకాలం పూర్తయినా ఇకపై టీడీపీ కార్యకర్తలుగా, నాయకులుగా గ్రామ సమస్యల పరిష్కారానికి పనిచేయాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు, మండల కన్వీనర్ పంపు కొండప్ప, మాజీ సర్పంచులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.