నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం..

నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం..

భీమవరం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటు

భీమవరం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి నూతనంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌ఎస్‌డీ) చైర్మన్‌గా ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆసుపత్రి సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కమిటీకి చెందిన 11 మంది సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కమిటీ సభ్యులుగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, వివిధ సామాజిక కార్యకర్తలు, అధికారులు, వైద్యాధికారులు నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభ్యులు రిజిస్టర్‌లో సంతకాలు చేసి ఆసుపత్రి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీల ద్వారా మౌలిక వసతులు, భవన మరమ్మతులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్య నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆసుపత్రి పనితీరు, వైద్య సేవలపై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. లక్ష్మణ్ జితానంద్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పరిపాలన అధికారి సిహెచ్ దివ్య ప్రశాంతి, ఇతర వైద్య సిబ్బంది, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Leave a Reply