పరిశ్రమల విప్లవానికి కొత్త బాట..

పరిశ్రమల విప్లవానికి కొత్త బాట..

నంద్యాల జిల్లాలో భారీ ఎంఎస్‌ఎంఈ ప్రణాళికలు

నంద్యాల, ఆంధ్రప్రభ : జిల్లాలో 199.10 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు.

సోమవారం గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో రూ.16.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన ఎంఎస్‌ఎంఈ పార్కుకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా “ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్”, “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

యాళ్లూరులో 9 ఎకరాల భూమిలో ఈ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించనున్నారు. మొత్తం 37 పారిశ్రామిక ప్లాట్లు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలో ఇప్పటికే డోన్, నందికొట్కూరు, బనగానపల్లి, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు అభివృద్ధి దశలో ఉన్నాయని వెల్లడించారు.

నంద్యాల జిల్లాలో వ్యవసాయం 42 శాతం, సేవా రంగం 40 శాతం ఆదాయం ఇస్తుండగా, పరిశ్రమల రంగం ద్వారా కేవలం 19 శాతం మాత్రమే వస్తోందని అధికారులు తెలిపారు. పరిశ్రమల అభివృద్ధితోనే జిల్లా జీడీపీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

అరటి, చిరుధాన్యాలు, పత్తి, మిర్చి వంటి పంటలు అధికంగా పండే ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఎంఎస్‌ఎంఈ పార్క్ రైతులు, యువత, స్థానిక పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తంగడంచ (నందికొట్కూరు)లో 50 ఎకరాల్లో 241 ప్లాట్లు, జగదుర్తి (డోన్)లో 36.09 ఎకరాల్లో 38 ప్లాట్లు, ఇటిక్యాల (బనగానపల్లి)లో 59.97 ఎకరాల్లో 266 ప్లాట్లు, ఆర్.కృష్ణాపురం (ఆళ్లగడ్డ)లో 44.04 ఎకరాల్లో 228 ప్లాట్లు అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ సంబంధిత స్థలాలను పరిశీలించారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే లక్ష్యమని పేర్కొన్నారు.