ఆలయ మండపంలోనే మహిళల ఆగ్రహం..

ఆలయ మండపంలోనే మహిళల ఆగ్రహం..

  • “మమ్మల్ని అవమానించారు” అంటూ ఈవో కార్యాలయం ఎదుట నిరసన..?
  • మహిళా అని చూడకుండా చేయి పట్టుకొని లాక్కెళ్లాడంటూ ఆరోపణ..!
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు
  • సరస్వతి పుష్కరాల వేళ కాళేశ్వరంలో ఉద్రిక్తత

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : దక్షిణ అరణ్యశైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారి సన్నిధిలో కొనసాగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా సోమవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పుష్కర సేవల కోసం వరంగల్‌ నుంచి వచ్చిన సేవాసమితి మహిళలతో దేవస్థాన చైర్మన్‌తో పాటు ఓ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మహిళలు ఆలయ ప్రాంగణంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుష్కర సేవలలో భాగంగా భక్తులకు సహాయ సహకారాలు అందించేందుకు వచ్చిన మహిళలను ఉద్దేశించి “మీరు ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చారు…? దర్శనం కోసం వచ్చారా…? తిండి కోసం వచ్చారా…?” అంటూ చైర్మన్‌ అవమానకరంగా మాట్లాడారని మహిళలు ఆరోపించారు. అంతేకాకుండా అసభ్యకర పదజాలంతో దూషించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

“ఏమె రావే… పోవే…” అంటూ ఏకవచనంతో సంభోదిస్తూ అవమానకరంగా మాట్లాడడం తమను తీవ్రంగా బాధించిందని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సేవ చేసేందుకు వచ్చిన తమను గౌరవించాల్సింది పోయి కించపరిచేలా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా మహిళా అని కూడా చూడకుండా ఓ మహిళ చేయి పట్టుకొని లాక్కెళ్లాడని సేవాసమితి సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనతో మహిళలు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై ఆలయంలోని ప్రధాన మండపం వద్దనే చైర్మన్‌ను నిలదీశారు. మహిళలంతా ఒకేసారి ప్రశ్నల వర్షం కురిపించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళల ఆగ్రహానికి సమాధానం చెప్పకుండా చైర్మన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అనంతరం సేవాసమితి మహిళలు ఈవో కార్యాలయం ఎదుట కాసేపు నిరసన వ్యక్తం చేశారు . “సేవ చేసేందుకు వచ్చిన మమ్మల్ని అవమానించడం ఏంటి…? మహిళలతో మాట్లాడే తీరు ఇదేనా…?” అంటూ మండిపడ్డారు. పుష్కరాల వంటి పవిత్ర వేళలో సేవాభావంతో వచ్చిన మహిళలను కించపరిచేలా మాట్లాడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా సేవాసమితి మహిళలు ఆలయంలో ఆగ్రహానికి గురైన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మహిళలు చైర్మన్‌ను నిలదీస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై భక్తులు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ దేవస్థాన పరిపాలన తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

పుష్కరాలకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఆలయ పరిపాలన వ్యవహారశైలిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని సేవాసమితి సభ్యులు డిమాండ్ చేశారు.

ఘటన సమయంలో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఇతర అధికారులు జోక్యం చేసుకుని మహిళలను శాంతింపజేసినట్లు సమాచారం. ఘటనపై దేవస్థాన అధికారుల అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.

Leave a Reply