సహనం వీడిన రైతులు.. రహదారిపై నిరసన

రాయపోల్, ఆంధ్రప్రభ : పంట పండించేందుకు ఏడాది పొడవునా శ్రమించిన రైతులకు ధాన్యం విక్రయ సమయంలో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయపోల్ మండలం ముంగాజ్‌పల్లి గ్రామానికి చెందిన రైతులు పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద వడ్లు తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో సోమవారం గజ్వేల్–చేగుంట ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం పేరుకుపోయినా అధికారులు స్పందించడం లేదని రైతులు ఆరోపించారు. వడ్లు అమ్ముకునేందుకు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం కొనసాగుతోందని మండిపడ్డారు.

లారీలు రాకపోవడంతో ధాన్యం ఎండలు, వర్షాలకు గురై పాడయ్యే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. వెంటనే ధాన్యం తరలింపునకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, వీరానగర్ గ్రామంలోని ఓ రైస్‌మిల్లు యజమాని స్థానిక రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇతర గ్రామాల నుంచి ధాన్యం సేకరిస్తున్నాడని రైతులు ఆరోపించారు. తమ గ్రామంలోనే పెద్ద ఎత్తున ధాన్యం నిల్వ ఉండగా బయట గ్రామాల నుంచి కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు. స్థానిక రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.

రైతుల ఆందోళనతో గజ్వేల్–చేగుంట రహదారిపై దాదాపు రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న తొగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్‌ఐ మానస, ఏపీఎం యాదగిరి ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.