ఈ-బైక్‌పై కలెక్టర్

పుట్టపర్తి, మే 25 (ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సోమవారం ఉదయం తన నివాసం నుంచి ఈ-బైక్‌పై కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వరుసగా రెండో సోమవారం కూడా ఆయన ఈ-బైక్‌ను వినియోగించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే ఉద్దేశంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు వాహన వినియోగాన్ని తగ్గించి, ఇంధన పొదుపు చర్యలను ప్రోత్సహించేందుకు కలెక్టర్ స్వయంగా ముందడుగు వేస్తున్నారు. సాధారణంగా అధికారిక వాహనాల్లో ప్రయాణించే ఉన్నతాధికారులు కూడా ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను వినియోగించాలని ఆయన చర్య ద్వారా సందేశం ఇస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ సిబ్బంది కలెక్టర్‌ను అభినందించారు.

విద్యుత్‌ ఆధారిత వాహనాల వినియోగం పెరిగితే కాలుష్యం తగ్గడమే కాకుండా ఇంధన వ్యయం కూడా గణనీయంగా తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా జిల్లా పరిపాలన మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం. కలెక్టర్ ఈ-బైక్‌పై కార్యాలయానికి రావడం చూసిన ప్రజలు, యువత ఆసక్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు స్వయంగా ఇలాంటి చర్యలు చేపట్టడం సమాజానికి మంచి సందేశమని పలువురు అభిప్రాయపడ్డారు.

Leave a Reply