జూలై 14లోగా ఎన్యూమరేషన్ ఫారమ్‌లు సమర్పించాలి
ప్రత్యేక డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారమ్‌ను తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. జూలై 14తో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగియనున్నందున మిగిలిన రోజులను సద్వినియోగం చేసుకుని ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆమె కోరారు.
శనివారం జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 14,05,443 మంది ఓటర్లు నమోదై ఉన్నారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి రెండు ఎన్యూమరేషన్ ఫారమ్‌లను అందజేస్తున్నారని తెలిపారు. ఒక ఫారమ్‌ను ఓటరు స్వీకరించినట్లు అంగీకారంగా ఉంచుకుని, రెండో ఫారమ్‌ను అవసరమైన వివరాలతో పూరించి తిరిగి బూత్ లెవల్ అధికారులకు అందజేయాలని సూచించారు. అందిన ఫారమ్‌లన్నింటినీ డిజిటలైజ్ చేసి తుది ఓటరు జాబితా తయారీలో వినియోగిస్తామని చెప్పారు. ఫారమ్‌ను సమర్పించని పక్షంలో సంబంధిత ఓటరు పేరు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదు కాకపోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
జిల్లాలో ఇప్పటివరకు 10,90,722 ఎన్యూమరేషన్ ఫారమ్‌లు ఓటర్ల నుంచి అందగా వాటిని విజయవంతంగా డిజిటలైజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. బూత్ లెవల్ ఏజెంట్ల సహకారంతో మరణించిన వారు, డూప్లికేట్ నమోదులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లకు సంబంధించిన 55,449 ఫారమ్‌లను కూడా డిజిటలైజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా 2,59,272 ఎన్యూమరేషన్ ఫారమ్‌లు ఓటర్ల నుంచి అందాల్సి ఉందన్నారు.
మిగిలిన ఫారమ్‌ల సేకరణను వేగవంతం చేసేందుకు శనివారం, ఆదివారం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
జూలై 14 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఓటరు బాధ్యతగా స్పందించి తమ ఎన్యూమరేషన్ ఫారమ్‌ను వెంటనే సంబంధిత బూత్ లెవల్ అధికారికి అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి విజ్ఞప్తి చేశారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు, అధికారులు సమిష్టిగా సహకరించాలని కోరారు.
పారదర్శకమైన, సమగ్రతతో కూడిన, తప్పులులేని ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి ఓటరి భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు విలువైనదని కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు.
