ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం..

పెనుకొండ రూరల్, మే 25 (ఆంధ్రప్రభ ) : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని పోలేకమ్మ గుడి సమీప జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వెళ్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే గోధుమల లోడ్‌తో వెళ్తున్న లారీకి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే గోధుమలతో ఉన్న లారీ పూర్తిగా కాలిపోయింది.

ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిరణ్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
