Andhra Pradesh power cuts | సబ్ స్టేషన్ల తనిఖీలు ముమ్మరం

Andhra Pradesh power cuts | సబ్ స్టేషన్ల తనిఖీలు ముమ్మరం

Andhra Pradesh power cuts | అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజల ఇబ్బందులు
సబ్ స్టేషన్లలో సమస్యలు.. నిలిచిపోతున్న విద్యుత్ సరఫరా
ట్రాన్స్‌ఫార్మర్ల కొరతతో పెరుగుతున్న అంతరాయాలు
మందడంలో అర్ధరాత్రి రోడ్డెక్కిన గ్రామస్తులు

Andhra Pradesh power cuts | అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండ వేడిమి భరించలేక ఏసీలు, కూలర్లతో ఉపశమనం పొందుతున్నారు. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోతలతో వారి వెతలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఓవైపు ఉక్కపోతకు తోడు కరెంట్ కోత తోడవుతోంది.

ముఖ్యంగా పల్లెలు, పట్టణాల్లో ప్రతిరోజూ ఏదో సమయంలో 15 నిమిషాల నుంచి 2 గంటల సేపు అప్రకటిత కోతలు విధిస్తుండడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొంటుండగా, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా పల్లెల్లో 6 గంటలు కూడా కోతలు విధిస్తున్నట్లు తెలిసింది. ఏదో ఒకరోజు అంటే లోడ్ రిలీఫ్ అనుకోవచ్చు కానీ, ప్రతిరోజు అయితే దీనిని ఏమంటారని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు అధికం కావడంతో సబ్ స్టేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్న సంఘటనలు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిత్యం జరుగుతున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఫీడర్లలో సమస్య తలెత్తడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

అసలే ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కరెంట్ కోతతో మరింత ఉక్కిరిబిక్కిరయ్యారు. 79 గ్రామాల్లో 2 గంటల పైగా సరఫరా లేక ప్రజల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 136 గ్రామాల్లో గంట నుంచి ఏడు గంటల వరకు సరఫరాలో అంతరాయాలు కలిగినట్లు డిస్కం గణాంకాలు చెబుతున్నాయి.

వేధిస్తున్న ట్రాన్స్‌ఫార్మర్ల కొరత

అవసరమైన సామగ్రిని ముందస్తుగానే సిద్ధం చేసుకున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక జిల్లాలో అధిక లోడ్‌తో 2 నుంచి 4 ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురవుతున్నాయి. వాటి స్థానంలో నూతన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, స్టోర్లలో అందుబాటులో ఉండడం లేదు.

దీంతో పాతవాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో ఫీడర్ల స్థాయిలో కూడా అనేక సమస్యలు ఉత్పన్నమవుతుండడంతో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఒక్కో జిల్లాలో 6 లక్షల యూనిట్ల వాడకం జరిగితే ప్రస్తుతం కోటికి పైగా యూనిట్లు వినియోగిస్తుండడంతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు.

ఒక 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌పై 200 కేవీఏకి మించి లోడ్ పెరగడంతో కొన్ని చోట్ల పేలిపోతున్నాయి. వేడెక్కిపోయి తీగలన్నీ నల్లగా మాడిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు.

మందడంలో రోడ్డెక్కిన ప్రజలు

అర్ధరాత్రి వేళ 3 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని ప్రాంతం మందడం గ్రామస్తులు రోడ్డెక్కారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వేసవిలో ముందస్తు సమాచారం లేకుండా సరఫరా ఎలా నిలిపివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపైకి చేరి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనల అనంతరం అధికారులు సరఫరా పునరుద్ధరించడంతో శాంతించారు.

సబ్ స్టేషన్ల తనిఖీలు

సత్తెనపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగి కార్మికులు గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ స్టేషన్లలో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో సీపీడీసీఎల్ పరిధిలోని పలు సబ్ స్టేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ తదితర అంశాలను డైరెక్టర్ మూర్తి తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మిగిలిన డిస్కంల్లో కూడా ఉన్నతాధికారులు సబ్ స్టేషన్ల తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి.

ముందస్తు ప్రణాళిక ప్రకారం అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుకోకపోవడంతోనే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వస్తున్నాయని, ఈ సమస్యను అధిగమించేలా చర్యలు చేపడతామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Leave a Reply