Census survey issues | జనగణనలో ప్రజల తికమక సమాధానాలు

Census survey issues | జనగణనలో ప్రజల తికమక సమాధానాలు

Census survey issues | పథకాలు పోతాయనే భయంతో తప్పుడు వివరాలు
భద్రాచలం అంశంపై వివాదం
డిజిటల్ జనగణనలో సాంకేతిక ఇబ్బందులు
ఇంటి నంబర్లు లేక గణకుల అవస్థలు

Census survey issues | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: జనగణనలో ప్రజలు అందిస్తున్న సమాచారం ఎన్యూమరేటర్లను తికమక పెడుతోంది. నిజాలు చెప్పేందుకు సుముఖత చూపడం లేదు. దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని బీఎల్వోలు ప్రభుత్వానికి నివేదించారు. సర్వేకు వెళ్తున్న సమయంలో ఎన్యూమరేటర్లు వేసే ప్రశ్నలకు ప్రజలు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. ఎక్కడ తమకు ప్రభుత్వ పరంగా వస్తున్న పథకాలు తప్పిపోతాయోనని భయంతో తప్పుడు సమాచారం ఇస్తున్నారు.

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంచుకుని, కీప్యాడ్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నామని, ఇంటర్నెట్ అంటే ఏంటో తమకు తెలియదన్నట్లుగా… కంప్యూటర్, ల్యాప్‌టాప్ పేర్లను మొదటిసారి వింటున్నట్లు సమాధానాలు ఇస్తున్నారని ఎన్యూమరేటర్లు బాధపడుతున్నారు. ప్రతి 100 మందిలో 10 నుంచి 15 మంది సొంతింటిని అద్దె ఇళ్లుగా చెబుతున్నారు. మేడలో ఉంటూ ఒకే పడకగదిలో నివాసం ఉంటున్నట్లు చెబుతున్నారు. ప్రజలు చెప్పిందే నమోదు చేసుకోవాల్సి రావడంతో, వారు చెప్పేది అబద్ధమని తెలిసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో నమోదు చేస్తున్నట్లు ఎన్యూమరేటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

భద్రాచలం విషయంలో వివాదం

సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో భద్రాచలం ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా చూపించడం వివాదాస్పదమైంది. దీనివల్ల తెలంగాణ ప్రజల హక్కులు, సరిహద్దుల అంశంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆన్‌లైన్‌లో ఎవరికి వారే తమ వివరాలు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, అవగాహన లోపంతో తక్కువ శాతం మంది మాత్రమే దానిని పూర్తి చేశారు.

కులాల డేటాను సేకరించడం వల్ల రాజకీయంగా దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని కొందరు వాదిస్తుంటే, సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఇది అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో గణకులు ఇళ్ల వద్దకు వచ్చి ఆస్తులు, ఆదాయం, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను అడుగుతుండటంతో.. ఈ సమాచారం కార్పొరేట్ సంస్థల చేతికి చిక్కితే వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజల నుంచి స్పందన లేకపోవడం, ఎక్కడికక్కడ సిబ్బందిని ప్రజలు నిలదీయడం, సమాచారం చెప్పకుండా దాటవేయడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పూర్తి స్థాయి సమాచారం సేకరించడానికి ఒక్కో కుటుంబానికి గంట సమయం పడుతుండటంతో గణకులకు శ్రమ ఎక్కువవుతోంది. ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ జనగణనలో ఇటువంటి అడ్డంకులను అధిగమించి, పారదర్శకంగా, కచ్చితమైన వివరాలను సేకరించాలని అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

జనగణనలో సేకరించే సమాచారం ఆయా ప్రాంతాల వారీగా ప్రజల జీవన స్థితిగతులను విస్తృతంగా తెలుసుకునేందుకు మాత్రమే అని, ప్రజలు అసత్యాలను చెప్పొద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు పొందుతున్న ప్రభుత్వ పథకాలకు, ఆసరా పింఛన్లు, రేషన్ కార్డు, ఇతరత్రా సామాజిక లబ్ధికి జనగణన సర్వేకు ఎలాంటి సంబంధం ఉండదని గుర్తు చేస్తున్నారు. అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలని వారు కోరుతున్నారు.

ఇంటి నంబర్లు లేక సమయం వృథా..

చాలా గ్రామాల్లో ఇళ్లకు సరైన నంబర్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. గణకులు ఇంటి నంబర్లతో పాటు గృహ గణన సంఖ్యను కూడా రాయాల్సి వస్తోంది. దీనికోసం ఒక్కో ఇంటి వద్ద అధిక సమయం వెచ్చించాల్సి వస్తోంది. కొందరు ఇంటి యజమానులు ఇంటి నంబర్లు వేయడానికి కూడా సహకరించడం లేదు.

దీనికి తోడు మండుటెండలు కూడా వారిని కలవరపరుస్తున్నాయి. మండే ఎండల్లో తిరుగుతూ పని చేయడం కష్టసాధ్యంగా మారుతోంది. ఎండ తీవ్రత వల్ల సర్వే వేగం కూడా తగ్గుతోంది. ప్రస్తుతం గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ఇళ్ల మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతోంది. అందరికీ టెక్నాలజీపై పూర్తి అవగాహన లేకపోవడం అత్యంత ముఖ్య సమస్యగా మారింది. ముఖ్యంగా కొంతమంది ఎన్యూమరేటర్లు గూగుల్ మ్యాప్ వినియోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిజిటల్ పద్ధతుల్లో అనుభవం తక్కువగా ఉండటం కారణంగా పనిలో ఆలస్యం జరుగుతోందని చెబుతున్నారు.

Leave a Reply