దురదపాడు, ముకుందాపురంలో అగ్ని ప్రమాదం…

దురదపాడు, ముకుందాపురంలో అగ్ని ప్రమాదం…
దురదపాడులో అగ్నికి ఆహుతైన 8 ఎకరాల పామాయిల్ తోట
దమ్మపేట, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో దురదపాడు, ముకుందాపురంలలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని దురదపాడు గ్రామంలో కాసాని నాగప్రసాద్ అనే రైతుకు చెందిన సుమారు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పామాయిల్ తోట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఏళ్ల తరబడి కష్టపడి, కంటికి రెప్పలా కాపాడుకున్న తోట కళ్లెదుటే దగ్ధమవడంతో రైతు ఆవేదనకు గురయ్యాడు.
దురదపాడు గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లో ఉన్న నాగప్రసాద్ పామాయిల్ తోటకు, గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారా ?లేదా ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని అగ్ని ప్రమాదం జరిగిందా అని స్థానికులు భావిస్తున్నారు .వేసవికాలం కావడం, తోటలో అంతర పంటగా వేసిన మొక్కజొన్న పంటకు మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే ఎనిమిది ఎకరాల తోట కాలిపోయింది. ఎంతో శ్రమించి పెంచిన తోట అగ్నిపాలు కావడంతో రైతుకు లక్షలాది రూపాయల భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేస్తున్నాడు.
ముకుందాపురంలో ..
దమ్మపేట మండలపరిధిలోని ముకుందాపురం గ్రామంలో ప్రమాదావశాత్తూ నిప్పంటుకుని పూచి రమేష్ కు చెందిన 7 ఎకరాల పామాయిల్ తోటలో 20 మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే ఊకే నాగేశ్వరరావు చెందిన 5 ఎకరాల పామాయిల్ తోటలో 18 మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి . విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలనే అగ్ని ప్రమాదం జరిగివుంటుందని బాధిత రైతులు భావిస్తున్నారు .
